అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం కరోనా కొత్త వేరియంట్ NB.1.8.1 వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఇప్పటికే దీని బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిందట.
ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన కరోనా కొత్త సబ్-వేరియంట్ NB.1.8.1 ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇప్పటికే ఈ వేరియంట్ భారినపడి చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు… ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌లలో ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
NB.1.8.1 పుట్టుక, వ్యాప్తి
NB.1.8.1 మొదట అమెరికాలో మార్చి చివర్లో ప్రారంభమయ్యింది. అక్కడి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులలో ఇది గుర్తించబడింది. అప్పటి నుండి ఒహియో, రోడ్ ఐలాండ్, హవాయిలలో కేసులు నిర్ధారించబడ్డాయి. భారతదేశంలో ఈ వేరియంట్ ఏప్రిల్ 2025లో తమిళనాడులో కనుగొనబడింది.
అత్యధికంగా హాంకాంగ్‌లో కేసులు పెరిగాయి. నాలుగు వారాల్లో 81 మంది ఈ వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురవగా 30 మరణాలు నమోదయ్యాయి. ప్రధానంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. చైనాలో కూడా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది… ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఈ కొత్త వేరియంట్ లక్షణాలు
మునుపటి ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే NB.1.8.1 తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వ్యాప్తి రేటు చాలా ఎక్కువ. సాధారణ లక్షణాల్లో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, అలసట, ముక్కు కారడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, సాధారణ అనారోగ్యం ఉన్నాయి. లక్షణాలు కొందరిలో బైటపడేలోపై నయమయ్యే అవకాశాలున్నాయి. వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వారికి ఇది ఎక్కువ ప్రమాదకరం.
వైద్య నిపుణుల సలహా
ప్రపంచ ఆరోగ్య సంస్థ NB.1.8.1 గురించి పెద్దగా హెచ్చరించనప్పటికీ వైద్య నిపుణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా ఇన్ఫెక్షన్లు తేలికపాటి శ్వాసకోశ లక్షణాలను చూపిస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ మోహిత్ శరణ్ చెప్పారు. అయితే ప్రజలు మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.