మీకు టీ తాగడం అంటే ఇష్టమా? ఒక్క రోజు కూడా టీ తాగకుండా ఉండలేరా? ఎలా తాగితే టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో మీకు తెలుసా?
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ దినచర్యలో టీ ఒక భాగం అయ్యిందని చెప్పొచ్చు. టీ కొందరికి అమృతంలా ఉంటే, మరికొందరికి నెమ్మదిగా విషంలా మారుతుంది. మితంగా, తెలివిగా తాగితే టీ అమృతమే. కానీ అదే అలవాటుగా మారితే, నెమ్మదిగా శరీరానికి హాని కలిగిస్తుంది. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా, టీని ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం..
టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (సరైన పద్ధతిలో తాగితే):
1. శక్తిని, చురుకుదనాన్ని పెంచుతుంది
టీలో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచడానికి, బద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
2. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది
గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని శుభ్రపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
3. జీర్ణక్రియకు సహాయపడుతుంది
అల్లం లేదా తులసి టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
4. ఒత్తిడిని తగ్గిస్తుంది
సాయంత్రం ఒక కప్పు టీ తాగితే, మనసు ఉల్లాసంగా మారుతుంది. మీకు ఏదైనా ఒత్తిడి ఉంటే అది తగ్గుతుంది.
టీ తాగడం వల్ల కలిగే నష్టాలు (తప్పుగా తాగితే):
1. ఖాళీ కడుపుతో తాగడం - శరీరానికి విషం
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.
2. ఎక్కువ కెఫీన్ - అలసట, నీరసం
రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, నిద్రకు కూడా భంగం కలుగుతుంది.
3. పాలు, పంచదార కలిపిన టీ - ఊబకాయం, డయాబెటిస్‌కు మిత్రురాలు
ఎక్కువ పంచదార, ఫుల్ క్రీమ్ పాలు కలిపిన టీ కేలరీలను పెంచుతుంది, కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది.
4. భోజనంతో పాటు లేదా వెంటనే తర్వాత
చాలా మందికి భోజనం చేసినప్పుడు లేదంటే, భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది కూడా చాలా హానికరం.టీలో టానిన్లు ఉంటాయి, ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి, దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.
టీ తాగడానికి సరైన సమయం:
- ఉదయాన్నే లేవగానే టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ పెరుగుతుంది.
- టిఫిన్ తర్వాత లేదా భోజనం చేసిన కొంత సేపటి తర్వాత టీ తాగితే జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- మధ్యాహ్నం అలసటగా అనిపించినప్పుడు టీ తాగితే శక్తిని పెంచుతుంది.
- రాత్రి పడుకునే ముందు టీ తాగితే నిద్రకు భంగం కలుగుతుంది.
ఆరోగ్యకరమైన టీ తాగడానికి చిట్కాలు:
- గ్రీన్ టీ, హెర్బల్ టీ లాంటివి తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
- పాలు, పంచదార మితంగా వాడండి.
- ఖాళీ కడుపుతో టీ తాగకండి.
- చాలా వేడిగా టీ తాగకండి - దీనివల్ల గొంతు, కడుపులో మంట వస్తుంది.
- రోజుకు రెండు సార్లు టీ సరిపోతుంది.
- అల్లం, తులసి, సోంపు, దాల్చిన చెక్క వంటి మూలికలతో టీ తయారుచేసుకోండి.