Aluminum Cookware: కొన్ని తరాలుగా ఎక్కువ శాతం ఇళ్లలో వంటకు అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అల్యూమినియం పాత్రల్లో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అల్యూమినియం పాత్రల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

మీకు తెలుసా? అల్యూమినియం భూమి మీద ఎక్కువగా దొరికే లోహాల్లో టాప్ లో ఉంది. అంతేకాకుండా ఇది మంచి ఉష్ణ వాహకం. అంటే వేడిని త్వరగా తీసుకుంటుంది. అందుకే అల్యూమినియం వంటపాత్రలు త్వరగా వేడెక్కుతాయి. అందువల్లనే మహిళలు వంట చేయడానికి వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వంట చేసేటప్పుడు కొద్దిగా అల్యూమినియం కూడా ఆహారంలో కలుస్తుంది. ఇది మన ఆరోగ్యంపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అల్యూమినియం వంటపాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అల్యూమినియం వల్ల కలిగే దుష్ప్రభావాలు

నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి..

శరీరంలో అల్యూమినియం ఎక్కువైతే నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్జీమర్స్ వ్యాధికి, అల్యూమినియానికి సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మీద కూడా అల్యూమినియం చెడు ప్రభావం చూపిస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. 

కిడ్నీ సమస్యలు..

శరీరంలోని వచ్చిన అల్యూమినియంను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అల్యూమినియం శరీరంలోనే ఉండిపోతుంది. ఇది కిడ్నీలకు మరింత హాని కలిగిస్తుంది. ఎక్కువ కాలం అల్యూమినియం కిడ్నీల వద్ద ఆగిపోతే వాటి పనితీరు తగ్గిపోతుంది.

ఎముకల సమస్యలు..

అల్యూమినియం ఎక్కువైతే ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా కాల్షియం శోషణను కూడా అల్యూమినియం అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే

రక్తహీనత.. 

అల్యూమినియం ఎక్కువైతే రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గి రక్తహీనతకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలున్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అల్యూమినియం ఎక్కువైతే కండరాల నొప్పులు, బలహీనత, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

ఎప్పుడు ప్రమాదం ఎక్కువ?

పుల్లటి పదార్థాలు అంటే టమాటా, నిమ్మకాయ, వెనిగర్ లాంటివి అల్యూమినియం పాత్రల్లో వండటం వల్ల అల్యూమినియం ఆహారంలో ఎక్కువగా కలుస్తుంది. ఎక్కువసేపు వంట చేయడం లేదా వేడిగా ఉంచడం వల్ల కూడా అల్యూమినియం ఎక్కువగా కలుస్తుంది. కొత్త వంటపాత్రల కంటే పాత, దెబ్బతిన్న వంటపాత్రల నుండి అల్యూమినియం ఎక్కువగా ఆహారంలో కలుస్తుంది.

సురక్షితంగా వంట చేయడం ఎలా?

అల్యూమినియం పాత్రలు వాడటం తప్పనిసరి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పుల్లటి పదార్థాలు వాటిల్లో వండకూడదు. ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. వేడి చేయకూడదు. గీతలు, దెబ్బలున్న పాత్రలు వాడకూడదు. మట్టి పాత్రలు, స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు లేదా పింగాణీ పాత్రలు వాడటం మంచిది.

ఇది కూడా చదవండి: సమ్మర్‌లో మామిడి కాయలు తింటే ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి