సాధారణంగా చాలామంది పుచ్చకాయ తినేటప్పుడు గింజలు నోట్లోకి వెళ్తే చిరాకు పడుతుంటారు. కానీ అవి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇంకెప్పుడు వాటిని వదిలిపెట్టరు. ఆ చిన్న గింజలే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Health Tips: పుచ్చకాయ తినేటప్పుడు పొరపాటున గింజలు మింగేస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటారు. కొందరు అయితే వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి, అవి మన ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతున్నారు నిపుణులు. 

పుచ్చ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ గింజలు చక్కగా సహాయపడతాయి.

నిపుణుల ప్రకారం పుచ్చకాయ గింజలను నేరుగా తింటే సాధారణంగా ఎలాంటి హాని జరగదు. అవి జీర్ణం కాకుండానే శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. కానీ, వాటిని సరైన పద్ధతిలో తింటేనే శరీరానికి అసలైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ గింజలతో కలిగే ప్రయోజనాలు:

* గుండె ఆరోగ్యం: ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం గుండె పనితీరును మెరుగుపరిచి, హై బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.

* పోషకాల పవర్‌హౌస్: వీటిలో ఉండే ప్రోటీన్, మంచి కొవ్వులు (Unsaturated Fat) శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

* చర్మం, జుట్టుకు మేలు: ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

* ఎముకల బలం: మెగ్నీషియం, కాపర్, ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపొరోసిస్ రాకుండా కాపాడతాయి.

* జీర్ణక్రియ, ఇమ్యూనిటీ: పుచ్చ గింజల్లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జాగ్రత్త:
పుచ్చకాయ గింజలు తినడం మంచిదే అయినా, ఒకేసారి ఎక్కువగా తింటే కడుపునొప్పి లేదా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తినడం మంచిది.

ఎలా తినాలి?

పుచ్చకాయ తినేటప్పుడు గింజలను నేరుగా నమిలి తినవచ్చు. కానీ, వాటిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, వేయించుకొని స్నాక్స్‌లా తింటే ఇంకా మంచిది. ఇలా చేస్తే అవి తేలిగ్గా జీర్ణమై, పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.