గుంటూరు:  టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు,వాసుపల్లి గణేష్ లపై వైసిపి దుష్ప్రచారాన్ని ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. టిడిపి బిసి నాయకులను వైసిపి టార్గెట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బిసిలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నచూపని... బిసి నాయకులు ఎదగడాన్ని జగన్ సహించలేడని ఆరోపించారు.

అచ్చెన్న, గణేష్ లకు వున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైసిపి బురద జల్లుతోందని అన్నారు.  బిసిల గొంతు నొక్కాలనేదే జగన్ లక్ష్యమని... బలహీన వర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దుపై తీర్మానం  చేశారని ఆరోపించారు. 31 మంది ఎమ్మెల్సీలు బీసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉండటాన్ని జగన్ ఓర్వలేక పోయారని అన్నారు.  20 మంది బీసీలు  ఇద్దరు ఎస్సీ,ఇద్దరు ఎస్టీ,  ముగ్గురు ముస్లింలు కౌన్సిల్ లో ఉండటంతో జగన్ కు కడుపు మంట మొదలయ్యిందని... అందువల్లే దాన్ని రద్దు చేశారని అన్నారు. 

బిసిలపై ద్వేషంతోనే ‘ఆదరణ’ పథకం రద్దు చేశారని... కార్పోరేషన్ల నిధులన్నీ దారిమళ్లించి స్వాహా చేశారని మండిపడ్డారు. వాటిని ప్రశ్నించారనే టిడిపి బిసి నేతలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో వైసిపి అరాచకాలను అచ్చెన్నాయుడు, గణేష్ లు నిగ్గదీశారని... తుగ్గక్ నిర్ణయాలను అసెంబ్లీలో ఎండగట్టారని పేర్కొన్నారు. అందుకే టిడిపి బిసి నేతలపై దుష్ప్రచారానికి తెగబడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. 

పొరుగు రాష్ట్రాలలో ఎలాచేశారో చూడాలని అచ్చెన్న అనడం తప్పా..? అని అడిగారు. అక్కడ ఏం అనుసరించారో పరిశీలించి అలాగే చేయమనడం నేరమా..? అని ప్రశ్నించారు. వాసుపల్లి గణేష్ మీద గతంలో ఎందుకని ఆరోపణలు చేయలేదు..? విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ ను చేస్తే ఓర్వలేరా..? అని చంద్రబాబు నిలదీశారు.

''జగన్ అవినీతి బురదలో పూర్తిగా కూరుకుపోయాడు. ఆ బురద టిడిపి నేతలకు అంటించాలని జగన్ కుతంత్రాలు. బిసిలపై వైసిపి అణిచివేత చర్యలను అందరూ గర్హించాలి. బలహీన వర్గాలపై వైసిపి దాడిని అందరూ ఖండించాలి. ఎంత అణిచేస్తే అంత ఎత్తుకు బిసిలు ఎదుగుతారు. సాక్షి ‘‘అబద్దాల మీడియా’’గా జగన్ అసెంబ్లీలోనే  చెప్పారు. అవినీతిలో పుట్టిన మీడియా సాక్షి ఛానల్, పేపర్ అవినీతిపై రాయడం హాస్యాస్పదం. ఈ అసత్య ఆరోపణలను ప్రజలే తిప్పికొడతారు''  అని   చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.