- Home
- Telangana
- Hyderabad: అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు.. ఆపై అలాంటి ఫొటోలు పంపమంటాడు
Hyderabad: అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు.. ఆపై అలాంటి ఫొటోలు పంపమంటాడు
Hyderabad: సోషల్ మీడియాలో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, సుమారు 1,000 మందిని హనీట్రాప్‌లోకి లాగిన యువకుడి వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. బ్లాక్మెయిల్ చేసి ఏకంగా రూ. 25.16 లక్షలు వసూలు చేశాడు.

అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు.. 1,000 మందికి వల
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కొండబత్తుల పవన్ కుమార్ (23) ఈ మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ ప్రకారం.. పవన్ నాలుగేళ్లుగా ఈ తరహా మోసాలు చేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన ఓ మోడల్‌తో పాటు పలువురు అమ్మాయిల ఫొటోలను ఉపయోగించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించాడు. ఆ ఖాతాల ద్వారా వైద్యులు, పోలీసు సిబ్బంది, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేవాడు. వారు రిక్వెస్ట్ అంగీకరించగానే అమ్మాయిలా పరిచయం చేసుకుని చాటింగ్ ప్రారంభించేవాడు. క్రమంగా సంభాషణను ఆశ్లీల చాటింగ్ వైపు మళ్లించి, అవతలి వ్యక్తుల నుంచి దుస్తులు లేని ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు.
తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కొంతమంది మోడళ్ల సెమీ దుస్తులు లేకుండా ఉండే ఫొటోలను కూడా ఎదుటివారికి పంపేవాడు. ఇలా ఇప్పటివరకు దాదాపు 1,000 మందిని తన వలలో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసాలకు సంబంధించి మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 16 జీబీ పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దుస్తులు లేకుండా వీడియోలు సేకరించి.. అమ్మాయి సోదరుడిగా కొత్త నాటకం
పవన్ మోసంలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అమ్మాయిలా మాట్లాడుతూ ఎదుటివారి నుంచి దుస్తులు లేకుండా ఫొటోలు, వీడియోలు సేకరించిన తర్వాత కొద్దిరోజులకు తన అసలు పాత్ర మార్చేవాడు. అప్పటివరకు చాటింగ్ చేసిన అమ్మాయికి సోదరుడినంటూ కొత్తగా పరిచయం చేసుకునేవాడు. నిజానికి అమ్మాయిగా, ఆమె సోదరుడిగా మాట్లాడేది ఒకే వ్యక్తి అయిన పవన్ కుమారే.
ఆ తర్వాత బాధితులకు ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపి బెదిరింపులకు దిగేవాడు. తన సోదరి ఆత్మహత్య చేసుకుందని, అందుకు బాధితులే కారణమని చెబుతూ డబ్బులు డిమాండ్ చేసేవాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేవాడు. దీంతో పరువు పోతుందనే భయంతో చాలామంది డబ్బులు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కోల్‌కతాకు చెందిన ఓ మోడల్ ఫొటోలను పవన్ ఎక్కువగా ఉపయోగించినట్లు డీసీపీ కిరణ్ ఖరే వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మోడల్‌ను కూడా సంప్రదించి సమాచారం అందించారు.
22 నుంచి 70 ఏళ్ల వరకు బాధితులు.. రూ.25.16 లక్షలు వసూలు
పవన్ మోసాలకు వివిధ వయసులు, వృత్తులకు చెందినవారు బలయ్యారు. బాధితుల్లో 22 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తుల వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారితో పాటు సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్, కెనడాలో నివసిస్తున్నవారు కూడా బాధితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 82 మందికి సంబంధించిన దుస్తులు లేకుండా ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. వీరందరినీ బెదిరించి పవన్ మొత్తం రూ.25,16,000 వసూలు చేసినట్లు వెల్లడించారు.
ఈ మోసాల కోసం పవన్ మొత్తం 27 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 నకిలీ ఐడీలు, ఫేస్బుక్లో 14 నకిలీ పేజీలు నిర్వహించాడు. ప్రియాంక, చందనశ్రీ, దీక్షిత, మూన్ బేబీ, ఆయిషా, స్వాతి వంటి అమ్మాయిల పేర్లతో పాటు మరికొన్ని పేర్లతో ఖాతాలు తెరిచాడు. ఈ ఖాతాల నుంచి ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదా మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
స్నేహితుడి ఫిర్యాదుతో బయటపడిన మోసం..
పవన్ చేస్తున్న మోసాలు చివరకు అతడి స్నేహితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD)లో డిప్లొమా చదువుతున్న సమయంలో పవన్‌కు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2021 సెప్టెంబర్‌లో అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'మూన్ బేబీ 5973' పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఖాతా పవన్ సృష్టించిందేనని అనుమానించిన ఆ వ్యక్తి పవన్‌ను ప్రశ్నించగా, పవన్ అంగీకరించాడు. దీంతో అక్కడితో అతనితో ఫ్రెండ్షిప్ను ముగించేశాడు.
అయితే ఆ తర్వాత కూడా పవన్ అతడిని వదల్లేదు. మరో హాస్టల్‌కు వెళ్లినా దగ్గరకు వెళ్లి కలిసి ఉండాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు ఏర్పడ్డాయని, తనపై ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేశాడని పవన్ ఫ్రెండ్ ఆరోపించాడు. తన వద్ద శారీరక సంబంధాలకు సంబంధించిన వీడియో ఉందంటూ బెదిరించి రూ.1.50 లక్షలు ఆన్లైన్లో, మరో రూ.2.50 లక్షలు నేరుగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం రూ.4 లక్షలు కోల్పోయిన సదరు ఫ్రెండ్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల హెచ్చరిక
ఈ ఫిర్యాదుపై సైదాబాద్ పోలీసులు అక్టోబర్ 17న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలోనే పవన్ సాగిస్తున్న భారీ హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. డిప్లొమా రెండో సంవత్సరంలోనే చదువు ఆపేసిన పవన్.. కుటుంబ సభ్యులకు మాత్రం మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
పవన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ సందర్భంగా డీసీపీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించే ముందు వారి ఖాతాలను పరిశీలించాలని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులు లేకుండా ఫొటోలు, వీడియోలు పంపవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.















