Weather Update: గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, మెరుపులు.. ఈ ప్రాంతాలకు వర్షాల అలర్ట్
Weather Update: ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గాలులతో పాటు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ జారీ చేసిన 7 రోజుల వాతావరణ సూచన ప్రకారం ఏపీ, యానాం, తెలంగాణ వర్షాలు, ఉరుములు, గాలుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వాతావరణ అప్డేట్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, యానాంకు ఏడు రోజుల వాతావరణ సూచన, రైతుల బులెటిన్‌ను విడుదల చేసింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ సబ్డివిజన్లలో ఈ వారం వర్షాలతో పాటు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
సోమవారం (నవంబర్ 23) కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం, గురువారం కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది.
ఈ వారంలో చివర నుంచి అంటే శుక్రవారం నుంచి కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వాతావరణ ఎలా ఉండనుంది?
భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ ప్రకారం.. రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు పొడి వాతావరణం వుండనుంది. ఈ వారం రోజులకు వాతావరణ హెచ్చరికలు లేవు. సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం వుంటుంది.
ఆ తర్వాత మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత శుక్రవారం నుంచి మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనుంది.
ప్రజలకు అలర్ట్
హైదరాబాద్ బులెటిన్‌లో వర్షపాతం, ఉరుములు, మెరుపుల ఉంటాయని పేర్కొంటూ ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడటం, ట్రాఫిక్ రద్దీ, తడి, జారే రోడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, విద్యుత్, నీరు, మురుగు నీరు పారుదలలో అవాంతరాలు వంటి ప్రభావాలు ఉండవచ్చని పేర్కొన్నారు.
ప్రజలు ప్రతికూల వాతావరణ పరిస్థితులపై కన్నేసి ఉంచాలని సూచించారు. పక్కా నిర్మాణాల్లో తలదాచుకోవాలని, బలహీనమైన గోడలు, ప్రత్యేకించి చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు, ఎందుకంటే అవి విద్యుత్తును ప్రసరింపజేస్తాయి. వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉంటూ తమ పనులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన చలి తీవ్రత
చలి గాలుల ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వాతావరణం భిన్నంగా ఉంది. హైదరాబాద్‌లో సోమవారం గరిష్ఠగా 31°C, కనిష్ఠంగా 20°C ఉష్ణోగ్రతలు ఉండగా, ఆకాశం మేఘావృతమై పొడిగా ఉంటుంది. తెలంగాణలో రాత్రి, తెల్లవారుజాము చలి పెరిగింది. ఈ సీజన్లో తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6°C, కోహీర్‌లో 9.7°C, న్యాల్కల్, ఝరాసంగంలో 10°C, కామారెడ్డి డోంగ్లిలో 10.5°C, వికారాబాద్ బషీరాబాద్, ధారూర్‌లో 11°C రికార్డయ్యాయి. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మొదలైంది.















