పాప్‌కార్న్ ఎందుకు పేలుతుందో ఆలోచించారా.? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఇదే
Popcorn: సినిమా చూస్తున్నప్పుడు చేతిలో పాప్‌కార్న్ ప్యాకెట్ ఉండాల్సిందే. చిన్న మొక్కజొన్న గింజలు వేడి చేయగానే ఒక్కసారిగా పేలి తెల్లగా, మెత్తగా మారిపోవడం చూస్తుంటాం. అయితే ఈ గింజలు పేలడం వెనకాల జరిగే ప్రక్రియ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గింజలో దాగి ఉన్న అసలు రహస్యం
పాప్‌కార్న్ గింజ బయటకు చూస్తే పూర్తిగా పొడిగా కనిపిస్తుంది. కానీ దాని లోపల కొంత తేమ ఉంటుంది. సాధారణంగా పాప్‌కార్న్ గింజల్లో 10 నుంచి 20 శాతం వరకు నీరు ఉంటుంది. ఈ గింజలకు బయటిభాగంలో గట్టి పొర ఉంటుంది. లోపల పిండి పదార్థం (స్టార్చ్), కొద్దిపాటి నీరు ఉంటాయి. ఈ ప్రత్యేక నిర్మాణమే పాప్‌కార్న్ తయారీకి ప్రధాన కారణం. సాధారణ మొక్కజొన్న గింజల్లో కూడా తేమ ఉన్నప్పటికీ, పాప్‌కార్న్‌లా పేలడానికి అవసరమైన గట్టి పొర, తేమ నిష్పత్తి ఉండదు.
వేడి చేయగానే పెరిగే ఒత్తిడి
పాప్‌కార్న్ గింజలను పాత్రలో వేసి వేడి చేయడం ప్రారంభించినప్పుడు వాటిలోని నీరు క్రమంగా వేడెక్కుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ నీరు ఆవిరిగా మారుతుంది. అయితే గింజ చుట్టూ ఉండే గట్టి పొర కారణంగా ఆ ఆవిరి వెంటనే బయటకు వెళ్లలేదు. ఫలితంగా గింజ లోపల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 180 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే సమయానికి గింజలోని పిండి పదార్థం మెత్తబడి, ఒత్తిడికి అనుగుణంగా విస్తరించడానికి సిద్ధమవుతుంది.
ఒక్కసారిగా పేలడానికి కారణం ఇదే
గింజ లోపల ఒత్తిడి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు దాని గట్టి బయటి పొర ఆ ఒత్తిడిని తట్టుకోలేక పగిలిపోతుంది. ఈ క్షణంలోనే మనకు ‘పాప్’ అనే శబ్దం వినిపిస్తుంది. లోపల పేరుకుపోయిన ఆవిరి ఒక్కసారిగా బయటకు రావడంతో మెత్తబడిన పిండి పదార్థం వేగంగా విస్తరిస్తుంది. ఈ ఆకస్మిక మార్పు వల్ల చిన్న మొక్కజొన్న గింజ కొన్ని క్షణాల్లోనే పెద్ద పరిమాణంలోకి మారిపోతుంది. గింజలు ఒకదాని తర్వాత ఒకటి పేలడం వల్ల పాప్‌కార్న్ తయారయ్యేటప్పుడు చిటపటలాడే శబ్దం వినిపిస్తుంది.
తెల్లగా, మెత్తగా ఎలా మారుతుంది.?
పాప్‌కార్న్‌లో కనిపించే తెల్లని భాగం గింజలోని పిండి పదార్థమే. అయితే అది ముందున్న రూపంలో ఉండదు. అధిక వేడి, ఒత్తిడి ప్రభావంతో స్టార్చ్ మెత్తబడి, గింజ పొర పగిలిన వెంటనే బయటకు విస్తరిస్తుంది. ఆ సమయంలో ఆవిరి విడుదల కావడంతో పిండి పదార్థం నురుగు లాంటి నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. అనంతరం అది చల్లబడుతూ గట్టిపడుతుంది. అందుకే పాప్‌కార్న్ తెల్లగా, తేలికగా, మెత్తగా కనిపిస్తుంది. అసలు గింజతో పోలిస్తే దాని పరిమాణం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.
కొన్ని గింజలు ఎందుకు పేలకుండా మిగిలిపోతాయి.?
పాప్‌కార్న్ తయారైన తర్వాత పాత్ర అడుగున కొన్ని గింజలు అలాగే ఉండిపోవడం చాలామంది గమనించే ఉంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఓల్డ్ మెయిడ్స్’ (Old Maids) అని పిలుస్తారు. గింజల్లో తగినంత తేమ లేకపోవడం, బయటి పొర దెబ్బతినడం లేదా వేడి సరిగా అందకపోవడం ఇందుకు కారణాలు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అన్ని రకాల మొక్కజొన్న గింజలతో పాప్‌కార్న్ తయారు చేయలేం. ఇందుకోసం ప్రత్యేకంగా పండించే పాప్‌కార్న్ రకాన్నే ఉపయోగిస్తారు. దాని గట్టి పొర, లోపలి తేమ సరైన నిష్పత్తిలో ఉండటం వల్లే వేడి చేసినప్పుడు గింజలు పేలుతాయి. అందుకే స్వీట్ కార్న్ లేదా ఇతర సాధారణ మొక్కజొన్న గింజలను వేడి చేసినంత మాత్రాన అవి పాప్‌కార్న్‌గా మారవు. చూసేందుకు చిన్న మొక్కజొన్న గింజే అయినా.. దాని లోపల జరిగే నీటి ఆవిరి, ఒత్తిడి, ఉష్ణోగ్రత మార్పుల సమ్మేళనమే పాప్‌కార్న్ తయారీ వెనుక ఉన్న అసలైన శాస్త్రం.















