షర్మిల చేతికి సరికొత్త ఆయుధం: జగన్ కు ప్రమాద ఘంటికలు
షర్మిల, జగన్ ల మధ్య పొరపచ్చాలు ఉన్నాయనేది తరచుగా వినిపించే మాట. వారి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని స్వయంగా వైసీపీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు.
అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన షర్మిల... కొలువుల దీక్ష పేరిట తెలంగాణ సర్కార్ తో డైరెక్ట్ యుద్ధానికి దిగింది. ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు దీక్ష ఆ తరువాత పాదయాత్రగా బయల్దేరడం, పోలీసుల అరెస్టు అన్ని వెరసి షర్మిల ఒక సీరియస్ పొలిటికల్ ప్లేయర్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. సమైక్యాంధ్ర కోసం బలంగా ఉద్యమించిన షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే ఆమె రాజకీయంగా మాత్రం పావులు బలంగా కడుపుతున్నట్టుగా అర్థమవుతుంది.
ఇక ఆరోజు దీక్షలో షర్మిల చేసిన ఒక వ్యాఖ్య హైలైట్ గా నిలిచింది. సాక్షి ఎలాగో మాకు కవరేజ్ ఇవ్వదు అని షర్మిల వ్యాఖ్యానించడం, దానికి వెంటనే విజయమ్మ షర్మిలను తట్టడం అంతా మీడియా కంటపడింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
షర్మిల, జగన్ ల మధ్య పొరపచ్చాలు ఉన్నాయనేది తరచుగా వినిపించే మాట. వారి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని స్వయంగా వైసీపీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోశాయి.
ఈ మొత్తం తతంగాన్ని గమనించిన అమరావతి మహిళలు షర్మిలకు ఒక లేఖ రాసారు. ఆ లేఖలో వారు తమ గోడు వెళ్లబోసుకోవడంతోపాటుగా షర్మిల ఎదుర్కున్న పరిస్థితులనే తాము కూడా ఎదుర్కొన్నామని చెబుతూ రెండు ఉదాహరణలిచ్చారు.
ఎలా అయితే పోలీసుల చేతిలో షర్మిల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారో అలానే తాము సైతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో నిత్యం ఎదుర్కొంటున్నామని, అంతే కాకుండా షర్మిల వదినమ్మ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి ఎలాగైతే కవరేజ్ కల్పించదు అని ఆమె అన్నారో అలానే తమను కూడా పట్టించుకోవడంలేదంటూ ఆ లేఖలో వారు వాపోయారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల చేస్తున్న ఉద్యమానికి మరింత నిబద్ధత రావాలంటే, ఆమె పోరాటాన్ని ప్రజలు గుర్తించాలంటే వచ్చి తమ అమరావతి పోరాటానికి మద్దతివ్వాలని వారు కోరారు. తమ లాంటి మహిళలు ఎదుర్కుంటున్న నిర్బంధానికి వ్యతిరేకంగా వచ్చి తమ ఉద్యమానికి మద్దతివ్వాలని వారు కోరారు.
ఈ విషయంలో షర్మిల ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని షర్మిల గనుక వారికి మద్దతు తెలపడానికి వెళితే తెలంగాణ హక్కుల కోసం తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో సైతం విభేదించడానికి తాను సిద్ధం అనే మెసేజ్ ఇచ్చినట్టవుతుంది. దీనివల్ల తన నిబద్ధతను ప్రశ్నించేవారికి, తెలంగాణ సెంటిమెంటును వ్యతిరేకంగా ప్రయోగించేవారికి దీన్ని ఉదాహరణగా చూపెట్టే ఆస్కారం ఉంటుంది.
షర్మిల గనుక ఈ విషయంలో ముందుకు వెళితే జగన్ ఇరకాటంలో పడతారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో త్యాగాలు చేసిన తన సొంత చెల్లికి కూడా జగన్ న్యాయం చేయలేకపోయాడు అనే అపవాదును మూటగట్టుకోవాల్సి రావడమే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంటుంది. చూడాలి ఈ విషయం ఎటువంటి టర్న్ తీసుకుంటుందో..!