ఐపీఎల్ 2021: హైదరాబాద్ కు మొండిచేయి, వెనక జై షా రాజకీయం...
అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో అసలు జై షా నడిపిని రాజకీయం ఏమిటో ఒకసారి చూద్దాము.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుండి ఈ క్రికెట్ మహాసంగ్రామం ప్రారంభమవనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారికూడా ప్రేక్షకులకు స్టేడియాల్లోకి అనుమతి లేదు. అంతేకాకుండా ఈసారి కూడా మ్యాచులు జరగనున్నాయి. ఎప్పుడైతే హోమ్ గ్రౌండ్లలో మ్యాచులు జరగవు అని తెలిసిందో అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ, కోల్‌కత నగరాలు వేదికగా ఐపీఎల్ 2021 జరగనుంది.
ఐపీఎల్ లో ఉన్న జట్లు 8. వేదికలు 6. ఇంకా కేవలం రెండు వేదికలను సిద్ధం చేస్తే ఐపీఎల్ సజావుగా సాగిపోయేది కదా అనే మాట వినబడుతుంది. సొంత టీం లేని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ మొత్తం తతంగంలో జై షా తన మార్కు రాజకీయాన్ని చూపించి అహ్మదాబాద్ లో మ్యాచులు జరిగేలా చేయడం కోసం తటస్థ వేదికల కాన్సెప్ట్యూను తెరమీదకు తీసుకొచ్చినట్టు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ లోని ఆరు వేదికల్లో సైతం ఏ టీం కూడా తమ సొంత గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ అలా ఆడితే మిగిలిన జట్లు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని కోల్పోతాయి. ఈ మొత్తం తతంగానికి అసలు కారణం అహ్మదాబాద్ ని వేదికగా సెలెక్ట్ చేయడం. అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో అసలు జై షా నడిపిని రాజకీయం ఏమిటో ఒకసారి చూద్దాము.
'వడ్డించే వాడు మనవాడైతే, బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటీ?' అనే నానుడి బీసీసీఐ కార్యదర్శి జై షా చేసి చూపిస్తున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌తో సంబంధం లేకపోయినా, భారత క్రికెట్ బోర్డు రాజకీయాల్లోకి వచ్చిన కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా... ఐపీఎల్ ఆతిథ్య నగరాల ఎంపికలో తన మార్క్ రాజకీయం చూపించాడు. ఇప్పటివరకు భారత జట్టు షెడ్యూల్‌కు మాత్రమే పరిమితమైన లాబీయింగ్.. తాజాగా ఐపీఎల్‌కూ పాకింది. వచ్చే ఏడాది అహ్మదాబాద్‌కు ఓ ఐపీఎల్ ప్రాంఛైజీ అందించేందుకు రంగం సిద్ధం చేసిన జై షా.. సొంత రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు మరో ఏడాది ఓపిక పట్టలేకపోయాడు.
కరోనా మహమ్మారి సాకుతో అసలు ఐపీఎల్ ప్రాంఛైజీయే లేని గుజరాత్ రాష్ట్రానికి ఐపీఎల్ మ్యాచులను తరలించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచుల వేదికలు, షెడ్యూల్‌పై పదునైన విమర్శలు వినిపిస్తున్నాయి. చెపాక్‌లో లీగ్ దశలో పది మ్యాచులు జరుగుతాయి. కానీ తంబీలకు ఎం.ఎస్ ధోని దర్శనం దక్కదు. అసలు అక్కడ ఎం.ఎస్ ధోని ఆడనే ఆడడు. వాంఖడేలో లీగ్ దశలో పది మ్యాచులు ఏర్పాటు చేసినా.. ముంబయి ఇండియన్స్ జట్టు అక్కడ సందడి చేయలేదు. ఐపీఎల్ సొంత మైదానం అనుకూలత అనగానే.. సొంత ప్రేక్షకుల నడుమ ఆడటం. అన్ని జట్లకూ ఆ బలం విలువ తెలుసు.
మహారాష్ట్రలో మినహా ఎక్కడా కరోనా వైరస్ విజృంభిస్తున్న దాఖలాలు లేవు. అక్కడ సైతం ప్రేక్షకులు లేకుండా లీగ్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమరం ఉన్నప్పటికీ చెన్నై, కోల్‌కతలు ఐపీఎల్ సందడికి తయారుగా ఉన్నాయి. అయినా, బీసీసీఐ ఈ ఏడాది సీజన్‌ను పూర్తిగా తటస్థంగా నిర్వహించేందుకు కంకణం కట్టుకుంది. ఆరు నగరాల్లో ఐపీఎల్‌ను నిర్వహిస్తూ, సొంత మైదానం అనుకూలత లేకపోవటం ఏమిటనే ప్రశ్న సగటు క్రికెట్ అభిమానిని తొలిచి వేస్తోంది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నా... బీసీసీఐ పెద్దలు వినలేదు.
భారతీయ జనతా పార్టీ (భాజపా) అధికారంలో లేని మూడు రాష్ట్రాల ఐపీఎల్ ప్రాంఛైజీలకు వారి సొంత నగరాల్లో మ్యాచులను కేటాయించలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్) ఇక్కడ మినహాయింపు లభించింది. సొంత నగరానికి ఐపీఎల్ మ్యాచులను తీసుకెళ్లాలనే జై షా కుటిల మంత్రాంగం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ కళ తప్పనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రాంఛైజీలు సొంత మైదాన భావనకు దూరం కావటంతో పాటు.. ప్రేక్షకులు సైతం అభిమాన జట్టుకు ఛీర్స్ కొట్టేందుకు దూరం కానున్నారు. తటస్థ వేదికల్లోనే నిర్వహించాల్సి వచ్చినప్పుడు పరిమితి వేదికల్లోనే మ్యాచులను నిర్వహించాల్సింది, ఏకంగా ఆరు ఆతిథ్య నగరాలను ఎంపిక చేసి అస్తవ్యస్థంగా షెడ్యూల్‌ను ప్రకటించటం విమర్శలకు కారణం అవుతోంది. అధికారం అండతో జై షా.. అహ్మదాబాద్‌కు ఏకంగా 12 మ్యాచులు (8 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్స్) తరలించటం గమనార్హం.