Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
Farmers Day 2025 : భారత్‌లో కోట్లాది మంది వ్యవసాయంపై చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నారు. వారి సేవలను గౌరవించేందుకు డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న టాప్-5 పథకాల గురించి తెలుసుకుందాం.

1. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) దేశంలో అత్యంత నమ్మకమైన రైతు పథకాలలో ఒకటి. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ డబ్బు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 21 విడతలు విడుదలయ్యాయి. రైతులు ఇప్పుడు 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.
2. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన
ప్రభుత్వం రైతుల కోసం ఒక కొత్త, పెద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని పేరు ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన. వ్యవసాయం లాభసాటిగా లేని ప్రాంతాలపై దృష్టి పెట్టడం ఈ పథకం లక్ష్యం. ఈ స్కీమ్ కింద సాగు ఖర్చు తగ్గించడం, నీటిపారుదల, నిల్వ, వనరుల సమస్యలపై పనిచేస్తారు. రైతుల ఆదాయం పెంచడానికి దీర్ఘకాలిక వ్యూహాలు రచిస్తారు. ఈ పథకం 2025-26 నుండి 6 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మొదట 100 వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.24,000 కోట్లు ఖర్చు చేస్తారు. దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
3. కిసాన్ క్రెడిట్ కార్డ్
వ్యవసాయంలో అతిపెద్ద సమస్య సరైన సమయానికి డబ్బు అందకపోవడం. ఈ సమస్యను కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిష్కరిస్తుంది. ఈ పథకంలో తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది. దీన్ని వ్యవసాయం, పశుపోషణ, ఉద్యానవనాలకు ఉపయోగించుకోవచ్చు. వడ్డీపై ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. ఇప్పుడు KCCని పీఎం కిసాన్ పథకంతో కూడా అనుసంధానించారు. దీనివల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత సులభమైంది. బ్యాంకు లేదా సమీప CSC కేంద్రం నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
4. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన
వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. పంట నష్టపోతే రైతుకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రమాదం నుండి కాపాడటానికే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఉంది. ఈ పథకం కింద చాలా తక్కువ ప్రీమియంతో పంటల భీమా లభిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, కీటకాలు లేదా వాతావరణం వల్ల కలిగే నష్టానికి పరిహారం అందుతుంది. భీమా మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకి వస్తుంది. ఈ పథకం రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
5. పీఎం కృషి సించాయి యోజన
నీరు లేకుండా వ్యవసాయం అసంపూర్ణం. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన లక్ష్యం ప్రతి పొలానికి నీరు అందించడం. ఈ పథకంలో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి టెక్నాలజీలపై సబ్సిడీ, తక్కువ నీటితో ఎక్కువ పంట, సాగునీటి ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం అనేక సందర్భాల్లో 50% వరకు సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల ఆధునిక నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సులభం అవుతుంది.

