- Home
- National
- Covid vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా.? పరిశోధనల్లో కీలక విషయాలు..
Covid vaccine: ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా.? పరిశోధనల్లో కీలక విషయాలు..
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పెరిగిన మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా యువతలో ఆకస్మిక మరణాలు షాక్‌కి గురి చేశాయి.

పెరిగిన ఆకస్మిక మరణాలు.
కరోనా అనంతరం దేశంలో ఆకస్మిక మరణాలు పెరగడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నా ఊహించని విధంగా మరణిస్తున్న సంఘటనలు వార్తల్లో చోటు చేసుకుంటున్నాయి. వీటిపై తీవ్ర పరిశీలన చేపట్టిన ఆరోగ్య సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి.
ICMR, AIIMS కీలక నివేదిక
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఎయిమ్స్ (AIIMS), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సంయుక్తంగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2023 మే నుంచి ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేశారు.
2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు సహజంగా కనిపించినా హఠాత్తుగా మరణించిన 18-45 ఏళ్ల వయసువారి సమాచారం సేకరించారు. ఈ పరిశోధనలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఈ మరణాలు జరుగుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అనారోగ్య సమస్యలే కారణం
సర్వేలో పాల్గొన్నవారిలో చాలామందికి గుండె సంబంధిత సమస్యలు, జీవితశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్ల లేకపోవడం, అలాగే మునుపటి అనారోగ్య చరిత్ర వంటి అంశాలను గురించారు. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, అల్కహాల్ వినియోగం, పొగతాగడం వంటి జీవనశైలి కారణాలు కూడా ఈ ఆకస్మిక మరణాలకు కారణమైనట్లు పరిశోధనల్లో తేలింది.
వ్యాక్సిన్‌లపై అపోహలు అవాస్తవం
కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల ఆకస్మిక గుండెపోటు వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్న విషయం తప్పుడు సమాచారం అని అధ్యయన నివేదికలు ఖండించాయి. వ్యాక్సిన్‌లు పూర్తిగా సురక్షితమని, అత్యంత అరుదుగా మాత్రమే దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. ఈ రకమైన నిరాధారమైన ప్రచారాలు ప్రజల్లో వ్యాక్సిన్‌లపై నమ్మకాన్ని తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాణాలను కాపాడిన టీకాలు
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కోట్లాది మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే ప్రాణాలు నిలిచాయని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తు చేసింది. టీకాలు లేకపోతే మరణాల సంఖ్య భారీగా ఉండేదని పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల ప్రమాదాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేయడం అనవసరమని, మెడికల్ డేటా ఆధారంగా మాత్రమే విశ్వసించాల్సిన అవసరం ఉందని సూచించారు.