- Home
- Entertainment
- Movie Reviews
- Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Samarasimha Reddy Review: కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి; మరికొన్ని ట్రెండ్ సెట్టర్స్‌గా మారతాయి. అటువంటి ట్రెండ్స్ సృష్టించడంలో బాలకృష్ణ రూటే వేరు. ఆయన నటించి ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘సమరసింహారెడ్డి’ సినిమా రివ్యూ చూద్దాం.

ఫ్యాక్షన్ సినిమాలకు బాటలు వేసిన బాలయ్య
తెలుగు సినీ చరిత్రలో "ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా" జానర్‌కు శంఖారావం పూరించిన సినిమా ‘సమరసింహారెడ్డి’. 1999 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్లడమే కాకుండా, ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్య సినిమాలకు సరికొత్త బాటలు వేసింది.
సమరసింహారెడ్డి కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో వాసుదేవ్ (నందమూరి బాలకృష్ణ) ఒక హోటల్ సర్వెంట్‌గా, సాధారణ అమాయక వ్యక్తిగా పరిచయమవుతాడు. కాంతమ్మ (జయచిత్ర) వద్ద హోటల్ పనిలో చేరి, మంచి సలహాలు ఇస్తూ ఆమె వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు. ఆ హోటల్ యజమాని కాంతమ్మ దగ్గర ఉన్న ముగ్గురు ఆడపిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. అతడు చిన్నతనంలో ఇంట్లోంచి వెళ్లిపోయిన తమ సొంత అన్నయ్యేనని తెలుసుకుని ఆ పిల్లలు ఆనందాన్ని తట్టుకోలేరు.
మరోవైపు కాంతమ్మ హోటల్ ఎదురుగానే చిట్టెమ్మ (సిమ్రాన్) హోటల్ ఉంటుంది. ఆమెతో నిత్యం గొడవపడుతూనే సరదాగా రొమాన్స్ చేస్తుంటాడు హీరో. కొన్ని ఊహించని పరిణామాల వల్ల హీరో అసలు పేరు వాసుదేవ్ కాదని తెలుస్తుంది. అదే సమయంలో అంజలి (అంజలా జవేరి) ఎంట్రీ ఇస్తుంది.
అతడు సాధారణ వాసుదేవ్ కాదని, రాయలసీమలో శత్రువుల గుండెల్లో నిద్రపోయే ధైర్యశాలి ‘సమరసింహారెడ్డి’ అని ఇంటర్వెల్ ముందు రివీల్ అవుతుంది. అసలు సమరసింహారెడ్డి ఎందుకు మారువేషంలో నగరానికి వచ్చాడు? ఆయన కుటుంబం ఏమైపోయింది? సీమ ప్రాంతంలో వీరరాఘవరెడ్డి (జయప్రకాశ్ రెడ్డి) కుటుంబం చేసే అరాచకాలు, కక్షల వల్ల సమరసింహారెడ్డి కుటుంబం ఎలాంటి నష్టాన్ని చవిచూసింది? తన చెల్లెళ్లను కాపాడుకోవడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి సమరసింహారెడ్డి శత్రువులపై ఎలా తిరుగుబాటు చేశాడు? అసలు వాసు ఎవరు అనేది మిగతా కథ.
నటీనటుల ఎలా చేశారంటే?
ఈ సినిమాకు ప్రాణం పోసింది బాలయ్య బాబు నటన. ఫస్ట్ హాఫ్ లో సాప్ట్ క్యారెక్టర్ గా కనిపించిన నందమూరి బాలకృష్ణ.. ఆతరువాత సమరసింహారెడ్డి పాత్రలో విశ్వరూపం చూపించారు. ఫ్యాక్షన్ లీడర్‌గా బాలయ్య దుమ్ముదులిపాడు. ఆయన చెప్పే డైలాగులు, గంభీరమైన బాడీ లాంగ్వేజ్ థియేటర్లను హోరెత్తించాయి. నీ ఇంటికొచ్చా.. నట్టింటికొచ్చ లాంటి డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇప్పటికీ ఈ సినిమా డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆ డైలాగ్స్ లో పవర్ ఏమాత్రం తగ్గలేదు.
ఇక హీరోయిన్లు సిమ్రాన్ అండ్ అంజలా జవేరి అద్భుతంగా నటించి మెప్పించారు. ఫస్ట్ హాఫ్ లో సిమ్రాన్ గ్లామర్ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఇక నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అంజలా జావేరి కూడా అద్భుతం చేసింది. సిమ్రాన్ హోమ్‌లీ , ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగా, అంజలా జవేరి గ్లామర్‌తో పాటు కథకు కీలక మలుపుగా నిలిచారు.
జయప్రకాశ్ రెడ్డి, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు ఈసినిమాకు ప్రాణం పోశారు. ఇక రాయలసీమ యాసలో జయప్రకాశ్ రెడ్డి చెప్పే విలనిజం డైలాగ్స్ కు ఆడియన్స్ కు పిచ్చెక్కిపోయింది. అవే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, ఏవీఎస్ కమెడియన్ గ్రూప్ కామెడీ సస్నివేశాలతో చక్కటి వినోదాన్ని పంచారు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిదిమేర అద్భుతంగా నటించి మెప్పించారు.
టెక్నికల్ టీమ్ ట్యాలెంట్ ఎలా ఉందంటే?
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బి. గోపాల్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. విజయేంద్రప్రసాద్ అందించిన గ్రిప్పింగ్ కథకు పరుచూరి బ్రదర్స్ రాసిన థండరస్ డైలాగులు ప్రాణం పోశాయి. ఇక ఈసినిమాకు పెద్ద బలం సంగతం. పాటలు బాలయ్య అభిమానులతో పాటు సంగీత ప్రియులను కూడా అలరించాయి. మణిశర్మ అందించిన పాటలు (“అందాల ఆడబొమ్మ”, “నందమూరి నాయకా”, “అడ్డీస్ అబ్బబ్బా”) ప్రతి ఒక్కటి చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి మాస్ సన్నివేశాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది.
సమరసింహారెడ్డి మాస్ హైలైట్స్
నిజానికి ఈసినిమాను ముందుగా బాలయ్య కోసం రాసుకోలేదట గోపాల్. విక్టరీ వెంకటేష్ తో ఈమూవీ ప్లాన్ చేశాడట. కానీ అది కుదరకపోవడంతో.. బాలయ్య వైపు టార్న్ అయినట్టు సమాచారం. అయితే ముందుగా అనుకున్న కథను బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చేశారట పరుచూరి సోదరులు. ఈసినిమాలో వాసుదేవ్ పాత్ర సమరసింహారెడ్డిగా రూపాంతరం చెందే సన్నివేశం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ సీన్లలో ఒకటి. "నీ ఇంటికి వస్తా.. వీరరాఘవరెడ్డి..!" వంటి సంభాషణలు థియేటర్లను ఊపేసాయి. ఈ సినిమాలో సీమ ఫ్యాక్షనిజం వెనుక ఉన్న కుటుంబ బంధాలు, చెల్లెళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేసాయి.
ఈసినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదట ఈ సినిమా కథను ముంబై మాఫియా నేపథ్యంలో రాసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన సహాయకుడిగా ఉన్న రత్నం సలహా మేరకు ఆ కథను ‘రాయలసీమ ఫ్యాక్షన్’ నేపథ్యానికి మార్చారు. విజయేంద్ర ప్రసాద్ ప్రకారం ఈ సినిమాలోని సవతి తల్లులు, చెల్లెళ్ల సెంటిమెంట్ ఎపిసోడ్‌కు తమిళ చిత్రం సిందూర పువ్వు కోర్ పాయింట్ స్ఫూర్తిగా నిలిచింది. ఇక దర్శకుడు బి. గోపాల్, పరుచూరి బ్రదర్స్ , విజయేంద్ర ప్రసాద్‌లతో కలిసి ఈ సినిమా కోసం సుమారు 25 నుండి 30 కథల వరకు చర్చించాక చివరికి ఈ ఫ్యాక్షన్ కథను ఖరారు చేశారు.
సమరసింహారెడ్డి ఆల్-టైమ్ బాక్సాఫీస్ రికార్డులు (Box Office Records):
సమరసింహారెడ్డి సినిమా సుమారు 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది. దాదాపు 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఆల్-టైమ్ ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. ఈమూవీ అత్యంత వేగంగా 73 కేంద్రాల్లో నేరుగా 100 రోజులు ఆడి సరికొత్త రికార్డు నమోదు చేసింది. 29 కేంద్రాల్లో నేరుగా 175 రోజులు (Silver Jubilee) ఆడిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించింది. 3 థియేటర్లలో ఏకంగా 227 రోజులకు పైగా ఆడి సరికొత్త మైలురాయిని తాకింది. అంతే కాదు డిస్ట్రిబ్యూటర్ షేర్‌గా 14 కోట్లకు పైగా రాబట్టిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటలకెక్కింది. అంతే కాదు ఒక థియేటర్ లో ఏకంగా ఈ సినిమా ఏకంగా 365 రోజులు (వన్ ఇయర్) ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టమట. సమరసింహా రెడ్డి మూవీని ఖాళీగా ఉన్న చాలా సందర్భాల్లో మెగాస్టార్ ఈమూవీ చూసినట్టు.. గతంలో చెప్పుకొచ్చారు.
సినిమా మాత్రమే కాదు (Final Verdict)
‘సమరసింహారెడ్డి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినీ వర్గాల్లో ఒక ట్రెండ్‌సెట్టర్. నందమూరి బాలకృష్ణ నటన, బి. గోపాల్ మేకింగ్, మణిశర్మ సంగీతం, పరుచూరి సోదరుల మాటలు కలగలసిన ఈ చిత్రం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సినిమా ప్రేమికులను మరీ ముఖ్యంగా మాస్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని ఒక ‘ఎవర్‌గ్రీన్ మాస్టర్‌పీస్’ సమరసింహారెడ్డి.

