Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Jowar Roti: ఇటీవలి కాలంలో చాలామంది చిరు ధాన్యాలతో చేసిన ఆహారాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అన్నం బదులు జొన్న రొట్టెలు తినడాన్ని ఇష్టపడుతున్నారు. మరి 30 రోజులపాటు అన్నం మానేసి జొన్న రొట్టెలు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇక్కడ చూద్దాం.

అన్నం బదులు జొన్న రొట్టెలు తింటే ఏమవుతుంది?
అన్నం బదులు జొన్న రొట్టె తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. జొన్నల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జొన్న రొట్టె తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మధ్యలో చిరుతిండి తినే అలవాటు తగ్గి, ఎక్కువ కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
షుగర్ కంట్రోల్
జొన్నల గ్లైసెమిక్ ప్రభావం అన్నంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అందువల్ల భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగే అవకాశం తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చక్కగా సహాయపడుతుంది. అయితే మందులు వాడుతున్నవారు ఆహారంలో మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
జీర్ణక్రియలో మార్పు
30 రోజుల పాటు జొన్న రొట్టెను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం తగ్గి, పేగుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఫైబర్‌ను ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి మొదట్లో కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. అందుకే జొన్నలను క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం, తగినంత నీరు తాగడం మంచిది.
నరాల పనితీరుకు
జొన్నల్లో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో, కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అన్నం మానేయలేనివారు..
అన్నం పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వైట్ రైస్ కూడా శరీరానికి కార్బోహైడ్రేట్ల రూపంలో శక్తిని అందించే ముఖ్యమైన ఆహారమే. కానీ వచ్చిన సమస్యల్లా, ఎక్కువ పరిమాణంలో తినడమే. కాబట్టి అన్నాన్ని పూర్తిగా మానేయలేని వారు మితంగా తీసుకుంటూ, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను వారంలో కొన్ని రోజులు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. అలాగే సరైన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, పండ్లు, కూరగాయలు, పప్పులు, తగిన మోతాదులో ప్రోటీన్, సరిపడా నీరు తీసుకోవడం కూడా ముఖ్యమే.

