మీ పిల్లల ఎముకలను బలంగా చేసే, వారి ఎత్తును పెంచే సూపర్ ఫుడ్స్..!
చిన్న పిల్లల ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే.. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు. అందుకే పిల్లల ఎత్తు పెరగడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఎలాంటి ఆహారాలను పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పిల్లల ఎత్తు పెరగకపోవడానికి లేదా పిల్లల ఎదుగుదల మందగించడానికి లేదా ఎముకలు బలహీనపడటానికి.. సరైన ఆహారం తీసుకోకపోవడమే అసలు కారణమంటున్నారు నిపుణులు. నేటి గజిబిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి ఇస్తున్నారు. కానీ ఆహారాల్లో పోషకాలు అసలే ఉండవు. వీటిని తినడం వల్ల పిల్లల్లో పోషకాల లోపం ఏర్పడుతుంది. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే ఎన్నో పోషకాలు, ఆహారం చాలా అవసరం.
మన ఆరోగ్యం బాగుండటానికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కణజాల మరమ్మత్తు, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర పోషకాలు ఎముకల ఆరోగ్యానికి అలాగే ఎత్తు పెరగడానికి ఎంతో అవసరం. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పులియబెట్టిన ఆహారాలలో కనిపించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియా అయిన ప్రోబయోటిక్స్ పిల్లలలో ఎత్తును పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం పిల్లలకు ఎలాంటి ఆహారాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఆవు పాలలో ప్రోటీన్, లాక్టోస్, కొన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఆవు పాలు చాలా ముఖ్యం. వేర్వేరు పాల ఉత్పత్తులలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, లాక్టోస్, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎత్తును ప్రభావితం చేస్తాయి. పిల్లలకు ఏ పాల ఉత్పత్తులను ఉపయోగించాలో నిర్ణయించేటప్పుడు అందులో పోషకాల పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవాలి.
గుడ్లు
గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు ముఖ్యంగా ప్రోటీన్ కు మంచి మూలం. ఎత్తు పెరగడానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు గుడ్లలో ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది కాల్షియాన్ని గ్రహించి ఎముకలను బలంగా చేస్తుంది.
ఆకు కూరలు
పోషకాలకు గొప్ప వనరులు ఆకు కూరలు. బచ్చలికూర, కాలే, క్యాబేజీ వంటి ఆకుకూరలు పోషకాహార నిధి. ఆకుకూరల్లో సాధారణంగా విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలోపేతం చేయడానికి పాటు ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతుంది.
చికెన్
చికెన్ లో ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి 12 ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్. ఇది హైట్ ను పెంచడానికి కావాల్సిన ముఖ్యమైన పోషకం. ఇది టౌరిన్ అనే అమైనో ఆమ్లాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణం, అభివృద్ధికి ముఖ్యమైనది.
పెరుగు
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలకు పెరుగు నచ్చకపోతే.. జున్నును పెట్టండి. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
సోయా
సోయా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లకు మంచి మూలం. ఒకవేళ మీరు శాఖాహారులైతే గుడ్లకు ఉత్తమ ప్రత్నామ్నాయం. దీనిలో కూడా ఎన్నో పోషకాలుంటాయి.