- Home
- Life
- ఇవి రైళ్లు కాదు కదిలే రాజభవనాలు.. మన దేశంలో వీవీఐపీలు ప్రయాణం చేసే రైళ్లు, ఒక్కో టికెట్ ఎంతంటే?
ఇవి రైళ్లు కాదు కదిలే రాజభవనాలు.. మన దేశంలో వీవీఐపీలు ప్రయాణం చేసే రైళ్లు, ఒక్కో టికెట్ ఎంతంటే?
మనదేశంలో ఎంతోమంది ధనవంతులు, వివిఐపీలు ఉన్నారు. వారు దేశంలోని దేవాలయాలు, రాజభవనాలు వంటివి చూడాలనుకుంటే కేవలం కార్లు, ఫ్లైట్లలోనే కాదు.. కొన్ని ప్రత్యేకమైన రైళ్లల్లో కూడా వెళతారు. అలాంటి విలాసవంతమైన రైళ్ల గురించి ఇక్కడ మేము ఇచ్చాము.

ప్యాలెస్ ఆన్ వీల్స్
భారతదేశంలోని ప్రాచీన లగ్జరీ రైళ్లలో ఇది కూడా ఒకటి. ఇది నిజంగా లోపలికి వెళితే ప్యాలెస్ లాగే అనిపిస్తుంది. 1982లో దీన్ని ప్రారంభించారు. ఈ రైలు రాజస్థాన్ రాచరిక వైభవాన్ని గుర్తుచేసేలా కనిపిస్తుంది. ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమై జైపూర్, ఉదయపూర్, జోధ్ పూర్ నుంచి అలా ఆగ్రాలోని తాజ్ మహల్ వరకు వెళుతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. లగ్జరీ డైనింగ్, స్పా, రాయల్ గదులు వంటివి ఉన్నాయి. ఏడు రాత్రుల పాటు ఈ రైలులో ప్రయాణం చేయడానికి ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.
రాయల్ రాజస్థాన్ అండ్ వీల్స్
ఈ రైలును కదిలే రాజభవనంగానే చెప్పుకోవాలి. రాజస్థాన్లోని రాజభవనాలు ఎంత అందంగా ఉంటాయో ఈ రైలు కూడా అంతే అందంగా ఉంటుంది. రాజస్థాన్లోని కోటలు, రాజభవనాలను మీకు చూడాలనిపిస్తే ఈ రైలులో ప్రయాణం చేయవచ్చు. ఇది ఢిల్లీ నుండి ప్రారంభమై రాజస్థాన్లోని బికనీర్, జైసల్మేర్, ఖజురహో వంటి ప్రదేశాలకు తీసుకెళ్తుంది. ఇందులో డీలక్స్ సెలూన్లు, డీలక్స్ గదులు ఉంటాయి. ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. రాచరిక ఆతిథ్యాన్ని అందిస్తాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే ఒక్కొక్కరు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
గోల్డెన్ చారియట్
దక్షిణ భారతదేశంలోని అందాలను చూపించే పురాతన రైలు ఇది. మీరు దక్షిణ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని చూడాలనుకుంటే బెంగళూరులో ఈ రైలు ఎక్కాలి. అక్కడి నుంచి గోవా, కర్ణాటక, కేరళ ఇలా అందమైన ప్రదేశాలకు మిమ్మల్ని మోసుకెళ్తుంది. రైళ్లలో ఆయుర్వేద స్పాలు, లగ్జరీ సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ రైలులో ఏడు రాత్రుల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం మీరు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
డెక్కన్ ఒడిస్సీ
ఇది ముంబై నుండి ప్రారంభమయ్యే లగ్జరీ రైలు అజంతా, ఎల్లోరా, కొల్హాపూర్, గోవా వంటి ప్రదేశాలకు తీసుకెళ్తుంది. దీనిలో రాయల్ కోచ్ లు ఎన్నో ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇందులో ఉంటాయి. మీరు ఇందులో ప్రయాణం చేయాలంటే నాలుగు నుండి ఆరు లక్షల రూపాయల వరకు ఒక టికెట్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మహారాజా ఎక్స్ ప్రెస్
ప్రపంచంలో ఉన్న ఖరీదైన రైళ్లలో మహారాజా ఎక్స్ ప్రెస్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని ఎన్నో చారిత్రక ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది చాలా ఖరీదైన రైలు. ఇందులో ఉండే ప్రెసిడెంట్ సూట్ వంటి ఒక ప్రత్యేకమైన గదులను బుక్ చేసుకోవాలంటే ఒక్కొక్కరూ 12 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ దొరికే భోజనం సంగతి చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. మన దేశంలోనే వివిఐపి ప్రజలంతా కూడా ఈ రైళ్లలోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు.