HEALTH TIPS: మగవారి కంటే ఆడవారికే ఎక్కువ నిద్ర అవసరమట! ఎందుకంటే?
Sleep: మన ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యం నిద్రపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కానీ పురుషులతో పోలిస్తే స్త్రీలకే ఎక్కువ నిద్ర అవసరమట. ఎందుకో తెలుసా?

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి?
ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యం నిద్రపై ఆధారపడి ఉంటుంది. నిద్రపై జరిపిన పలు అధ్యయనాలలో కీలకమైన, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుషులు, మహిళల నిద్ర అవసరాలలో వ్యత్యాసాన్ని ధృవీకరిస్తున్నాయి. పురుషుల కంటే మహిళలు సగటున 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం మహిళలు ఒకేసారి పలు సంక్లిష్టమైన పనులను నిర్వహిస్తారు. కాబట్టి వారి విశ్రాంతి అవసరం. అలాగే.. నిద్రలేమి వల్ల మహిళల మానసిక ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతినే అవకాశముండగా, పురుషుల్లో ఈ ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. అదనంగా, మహిళల జీవితంలోని వివిధ దశల్లో హార్మోన్ల మార్పుల కారణంగా వారు నిద్రలేమి సమస్యలను అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మల్టీటాస్క్ చేస్తే... నిద్ర మస్ట్!
మహిళలకు ఒకేసారి పలు పనులు చేసే సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు స్త్రీలు ఉద్యోగానికి వెళ్తూనే పిల్లలు, ఇంటిపనులు, కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించగలరు. ఈ మల్టీటాస్కింగ్ మెదడుపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే మహిళలకు ఎక్కువ విశ్రాంతి అవసరం. ఈ విశ్రాంతి నిద్ర ద్వారా మాత్రమే పూర్తిగా లభిస్తుంది.
హార్మోన్ల ఆటుపోట్లు
ఋతుచక్రం, గర్భధారణ, మెనోపాజ్ వంటి దశల్లో మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత నిద్ర నాణ్యతను దెబ్బతీసి, నిద్రలేమికి దారితీస్తుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం.
మానసిక ఆరోగ్యం:
సామాజికంగా, కుటుంబపరంగా మహిళలు ఒత్తిడికి గురవుతారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి మెదడుకు తగినంత విశ్రాంతి అవసరం. నిద్ర ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి వల్ల నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు రావచ్చు. మహిళల్లో ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే వారికి మంచి నిద్ర ఎంతో అవసరం. ఇది మానసిక స్థితిని స్థిరంగా ఉంచడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
నిద్రలేమి పరిణామాలు:
పురుషులతో పోలిస్తే నిద్రలేమి వల్ల మహిళలు ఎక్కువ ప్రభావితమవుతారు. మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గుదల, అజాగ్రత్త వంటి సమస్యలు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తాయి. ఈ పరిణామాలను తగ్గించేందుకు, మెదడుకు తగినంత విశ్రాంతి అవసరం. మంచి నిద్ర వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సామాజిక, కుటుంబ బాధ్యతలు:
చాలా ఇళ్లలో పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలను మహిళలే చూసుకుంటారు. ఈ ఒత్తిడి వల్ల వారికి పూర్తి విశ్రాంతి లభించదు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత కూడా ఇంటి పనులు, కుటుంబ సభ్యుల పనులు చేయాల్సి ఉంటుంది. నిరంతర శ్రమ కారణంగా నిద్ర సమయం తగ్గుతుంది. శారీరకంగా విశ్రాంతి అవసరమైన సమయంలోనూ, మహిళలు మళ్లీ పని భారంతో నిద్రను త్యాగం చేయాల్సి వస్తుంది.
గర్భధారణ నుంచి ప్రసవం వరకు…
గర్భధారణ సమయంలో మహిళలలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు జరుగుతాయి. ఈ దశలో నిద్రలేమి ఒక సాధారణ సమస్య. ప్రసవానంతరం, శిశు సంరక్షణ బాధ్యతల కారణంగా తల్లులకు తగినంత విశ్రాంతి లభించదు. దీని ప్రభావంగా వారు శారీరక అలసట, మానసిక ఒత్తిడి, నిరాశను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితుల్లో శరీరం తిరిగి సామర్థ్యాన్ని పొందేందుకు, మానసిక స్థిరత్వం నిలబెట్టేందుకు ఎక్కువ నిద్ర అత్యంత అవసరం.
నిద్ర లేకుంటే… బరువు పెరగడమే!
పురుషుల కంటే మహిళలకు స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి కారణంగా ఆకలిని నియంత్రించే లెప్టిన్, ఘ్రెలిన్ వంటి హార్మోన్ల పనితీరును దెబ్బతింటుంది. దీని వల్ల అధికంగా తినాలనే కోరిక కలుగుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. జీవక్రియను సమతుల్యం చేయడం, బరువును నియంత్రణలో ఉండాలంటే మహిళలకు తగినంత, నాణ్యమైన నిద్ర చాలా అవసరం.