Skipping Dinner: 11 రోజులపాటు రాత్రిపూట భోజనం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
మన ఆరోగ్యం ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది రాత్రి భోజనం మానేస్తున్నారు. దానివల్ల నిజంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? హాని జరుగుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Skipping Dinner Benefits
రాత్రిపూట భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం 11 రోజుల పాటు రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరానికి కొంతవరకు మేలు జరుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే హాని జరిగే ప్రమాదం ఉంది. అయితే క్రమం తప్పకుండా 11 రోజులపాటు రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థపై ప్రభావం
నిపుణుల ప్రకారం 11 రోజులపాటు రాత్రిపూట తక్కువ లేదా భోజనం మానేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది, గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం పూర్తిగా మానేయడం కాకుండా, తేలికపాటి సూప్, సలాడ్ లేదా ప్రోటీన్ షేక్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. లేకపోతే మలబద్ధకం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
రాత్రి భోజనం మానేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కొంతమందిలో మొదటి మూడు, నాలుగు రోజులు అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి. కానీ శరీరం ఆహార నియంత్రణకు అలవాటు పడిన తర్వాత, శ్రద్ధ, ఫోకస్, మానసిక స్పష్టత పెరుగుతుంది. కొంతమందికి రాత్రి ఆకలి వల్ల నిద్ర సమస్యలు, అలసట ఏర్పడవచ్చు, దానివల్ల ఫోకస్ తగ్గుతుంది.
హార్మోన్లపై ప్రభావం
రాత్రి భోజనం మానేయడం వల్ల మెలాటోనిన్, గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. మెలాటోనిన్ స్థాయిలు పెరగడం వల్ల నిద్ర గాఢంగా మారుతుంది. గ్రెలిన్ తగ్గడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. లెప్టిన్ పెరగడం వల్ల శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది. కానీ కొందరిలో షుగర్ లెవల్స్ తగ్గడం లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు.
నిపుణుల సూచన..
ఈ పద్ధతిని డాక్టర్ సలహా లేకుండా ప్రాక్టీస్ చేయడం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలు, షుగర్, హైపోటెన్షన్ ఉన్నవారు రాత్రి భోజనం మానేసే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే ఈ 11 రోజుల ప్రాక్టీస్‌లో రోజువారీ వ్యాయామం, సరైన హైడ్రేషన్, ప్రోటీన్-రిచ్ ఆహారం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరి శరీర పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి, వ్యక్తిగత అవసరాలను గమనించుకుంటూ సరైన ప్రణాళికతో చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చని వివరిస్తున్నారు.

