- Home
- Life
- Health
- Top 5 Worst Breakfast : ఇండియన్స్ పొద్దుపొద్దునే తినే అత్యంత చెత్త టిఫిన్స్ ఇవే.. మీరూ తింటున్నారా..?
Top 5 Worst Breakfast : ఇండియన్స్ పొద్దుపొద్దునే తినే అత్యంత చెత్త టిఫిన్స్ ఇవే.. మీరూ తింటున్నారా..?
Top 5 Worst Breakfast : మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా…? అయితే పొద్దుపొద్దునే కొన్నిరకాల టిఫిన్స్ తినడం మానేయండి. అస్సలు తినకూడని టాప్ 5 చెత్త టిఫిన్స్ ఏవో తెలుసా?

ఈ టిఫిన్స్ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
Top 5 Worst Tiffins : పొద్దుపొద్దున లేవగానే టిఫిన్ కడుపులో పడటంతోనే చాలామందికి డే స్టార్ట్ అవుతుంది. ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలనే అనుకుంటారు... కానీ తెలియకుండానే చెత్తను కడుపులో వేస్తుంటారు. కొన్ని టిఫిన్స్ నోటికి రుచికరంగా ఉండటంతో ప్రతిరోజూ ఇష్టంగా తింటుంటారు. అయితే ఇంట్లో వండుకుని లేదంటే టిఫిన్ సెంటర్స్ లో కొనుక్కుని లొట్టలేసుకుని తినే కొన్నరకాల బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి అస్సలు మంచివికావని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి సరే... కానీ డెయిలీ రొటీన్ లో ఇవి ఉంటే వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి టాప్ 5 చెత్త టిఫిన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. సేమియా ఉప్మా
ఇందులో మైదా తప్పితే ఇంకేమీ ఉండదు.. ప్రోటీన్లు, విటమిన్లు వంటివి ఏమీ ఉండవు సరికదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు, బరువు తగ్గాలనుకునేవారికి అస్సలు మంచిదికాదు.
అయితే సేమియా ఉప్మాను ఇష్టపడేవారు మైదాకు బదులు గోధుమ, రాగులతో చేసిన సేమియాతో ఉప్మా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కూరగాయలు వాడటంవల్ల మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఇలాంటి సేమియా ఉప్మాలో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. కానీ మైదాతో చేసిన సేమియా మాత్రం అస్సలు ఆరోగ్యకరం కాదు.
2. స్వీట్ పొంగలి (చక్కెర పొంగలి)
ఇందులో విపరీతమైన చక్కెర, బెల్లం వేస్తారు... అలాగే నెయ్యిని కూడా ఎక్కువగా వాడతారు. కాబట్టి స్వీట్ పొంగలి ఎక్కువగా తినడంవల్ల శరీరంలో చక్కెరస్థాయి వేగంగా పెరుగుతుంది. కాబట్టి పొద్దుపొద్దున దీన్ని టిఫిన్ గా తీసుకోవడం అస్సలు మంచిదికాదు.
డయాబెటిస్ తో బాధపడేవారికే కాదు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా స్వీట్ పొంగలి మంచిదికాదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు అస్సలు దీనిజోలికి వెళ్లకపోవడమే మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారుకూడా దీనికి దూరంగా ఉండాలి.
3. సెట్ దోసె (మైదా దోసె)
మైదాపిండితో చేసే సెట్ దోసే ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు. మైదాలో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉండటంవల్ల జీర్ణక్రియ మందగిస్తుంది... అంతేకాదు బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. అందుకే ఇది మార్నింగ్ తినదగ్గ బ్రేక్ ఫాస్ట్ కాదు. అంతగా కావాలంటే బియ్యం, మినపప్పు పిండితో తయారుచేసే సాధారణ దోసెలు తినవచ్చు.
4. రవ్వ ఉప్మా
సాధారణంగా చాలామంది ఉప్మాను అస్సలు ఇష్టపడరు. కానీ తయారీ విధానం చాలా సింపుల్... తొందరగా అవుతుందని దీన్ని చేస్తుంటారు. అయితే రవ్వా ఉప్మాను తినడంవల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఇందులో కార్బోహైడ్రైట్స్ తప్ప ఏమీ ఉండవు. ఉప్మాను ఇష్టపడేవారు ఈ తెల్ల రవ్వతో కాకుండా గోధుమ లేదంటే మిల్లెట్స్ రవ్వతో ఉప్మా చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.
5. పూరీ
నూనెలో పూర్తిగా స్నానంచేసిన పూరీలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యకరమైన టిఫిన్ కాదు. ఇందులో అధిక కేలరీలు, కొవ్వు ఉంటుంది... కాబట్టి బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
ఇక బంగాళాదుంప కూరతో పూరీ తినడం టేస్టీగా ఉంటుంది... కానీ ఈ కాంబినేషన్ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతగా పూరీ తినాలనిపిస్తే మైదాతో కాకుండా గోధుమపిండితో చేసినవి... ఆలూ కర్రీతో కాకుండా ఇతర కూరగాయలు, సలాడ్స్ తో తినడం మంచిది. పూరీలు చేయడానికి స్వచ్చమైన మంచినూనె వాడాలి.

