Tomato Benefits: రోజూ టమాటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
మనం ఎక్కువగా వాడే కూరగాయల్లో టమాటా ఒకటి. నిజం చెప్పాలంటే.. టమాటా లేకుండా చాలా రకాల వంటలకు రుచే లేదు. టమాటాల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. టమాటాలను రోజూ తినడం వల్ల కలిగే లాభాలెంటో చూద్దాం.

టమాటాలు విటమిన్లకు మంచి మూలం
టమాటాలు.. చాలా రకాల వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, బీటా కెరోటిన్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. టమాటాలను రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి మంచిది
టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్. నిపుణుల ప్రకారం.. టమాటాలను రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే పోషకాలు గుండెకు రక్షణగా నిలుస్తాయి.
మెరుగైన కంటి చూపు..
టమాటాల్లో ఉండే లైకోపీన్ కళ్లకు కూడా మంచిది. టమాటాలో లుటీన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపునకు మద్దతు ఇస్తాయి. కంటిశుక్లం, మాక్యులర్ డీజనరేషన్ నుంచి కళ్లను రక్షిస్తాయి.
జీర్ణ సమస్యలు..
టమాటాల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. వీటిలో సెల్యులోజ్, హెమి సెల్యులోజ్, పెక్టిన్ అనే ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి.
క్యాన్సర్ నుంచి రక్షణ
2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం టమాటాలు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్లు.. క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా నాశనం చేస్తాయి. కాబట్టి టమాటాలను రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చు.
టమాటా రసంతో..
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఉప్పు లేని టమాటా రసం తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఉన్న పెద్దవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గాయని తేలింది. ఈ అధ్యయనంలో.. జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 500 మంది రోగులను పరీక్షించారు.