Raw Ginger : ఖాళీ కడుపుతో పచ్చి అల్లం తింటే.. ఆ సమస్యలు మాయం..!
Raw Ginger Benefits : ఔషధ గుణాలున్న అల్లం శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరి ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తినవచ్చా? తింటే ఏమవుతుంది? అల్లం ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో అల్లం తింటే ఏం జరుగుతుంది?
నేటి జీవనశైలిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామానికి సమయం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిలో ఊబకాయం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మన ఆహారంలో సహజమైన ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అటువంటి శక్తివంతమైన ఔషధ గుణాలున్న పదార్థం అల్లం. అల్లం శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. మరి ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తినవచ్చా? తింటే ఏమవుతుంది? అల్లం ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెంపు
వైద్య నిపుణుల ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరం. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని ఉత్తేజితంగా ఉంచుతుంది. ఇది లాలాజలం, జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి, అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంలోని సహజ సమ్మేళనాలు కడుపు నొప్పి, ఉదయం వికారం వంటి సమస్యలకు ఉపశమనం కల్పిస్తాయి. అంతేకాదు, అల్లంలో బాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే గుణాలుండటం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడంతో ఆరోగ్యాన్ని కాపాడటంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
అల్లం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల డయాబెటిస్, PCOS ఉన్నవారికి అల్లం చాలా ఉపయోగపడుతుంది. అదనంగా.., అల్లం వల్ల గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడంలో సహాయపడుతుంది.
అలసట తగ్గిస్తుంది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం ముక్క తింటే అలసట తగ్గి, శక్తి లభిస్తుంది. అల్లంలో ఉండే సహజ గుణాలు ఆకలిని అణచివేస్తాయి. దాంతో అనవసరంగా తినకుండా ఉండటానికి సహాయపడతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. శరీరంలో మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి, కొవ్వును త్వరగా కరిగించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
అల్లం ఎలా తినాలి?
పచ్చి అల్లం ముక్కపై కొద్దిగా నిమ్మరసం చుక్కలు, చిటికెడు ఉప్పు వేసి ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజింపజేసి, గ్యాస్, అజీర్నం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక: మీరు ఏవైనా మందులు వాడుతున్నా, లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే ఈ విధమైన మార్పులు చేయాలి. ఆరోగ్యం కోసం సహజ మార్గాలు మంచివే అయినా, వైద్య సలహా మరింత అవసరం.

