Ginger Chutney: ఇలా చేస్తే అల్లం చట్నీటేస్ట్ అదిరిపోతుంది!
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలుసు. కానీ అల్లం చట్నీకూడా చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మరి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే అల్లం చట్నీ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వివిధ రూపాల్లో అల్లాన్ని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, అజీర్ణం, కడుపు నొప్పి లాంటి వాటికి అల్లం చట్నీ చక్కని పరిష్కారం.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలి. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అల్లం చట్నీకి కావాల్సినవి
అల్లం - 1/2 కప్పు
శనగపప్పు - 2 చెంచాలు
ఎండు మిరపకాయలు - 5
కరివేపాకు - 10- 15 రెబ్బలు
చింతపండు - కొంచెం
బెల్లం - 1/2 చెంచా
వంట నూనె - 2 చెంచాలు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - 1/2 చెంచా
అల్లం చట్నీ తయారీ విధానం
ముందుగా చింతపండును నీళ్ళలో నానబెట్టాలి. అల్లం పొట్టును తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాండీ లో నూనె వేసి, అల్లం వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో శనగపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేయించాలి.
అల్లం చట్నీ రెడీ
వేయించిన అల్లం, శనగపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. ఉప్పు, బెల్లం కూడా వేసి, చింతపండు రసం పోసి మెత్తగా రుబ్బాలి. చిన్న గిన్నెలో ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి చట్నీలో కలపాలి. రుచికరమైన అల్లం చట్నీ రెడీ. ఇడ్లీ, దోసెలతో దీన్ని తినవచ్చు.