Headache: ఈ అలవాట్లు మార్చుకుంటే జన్మలో తలనొప్పి రాదు
Headache: తలనొప్పి ఎందుకు తగ్గడం లేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని మందులు మారినా ఫలితం లేకపోతే..సమస్య ఎక్కడుంది?. రోజువారీ జీవితంలో సహజమైన ఈ అలవాట్లు మార్చుకోకపోతే తలనొప్పి ఎప్పటికీ తగ్గదు. ప్రముఖ న్యూరాలజిస్టులు ఏం చెప్తున్నారంటే..

తలనొప్పి చిన్న సమస్య కాదు
తలనొప్పి అంటే చిన్న సమస్య అనుకుంటాం కానీ, ఒక్కసారి వచ్చిందంటే రోజంతా పనులన్నీ ఆగిపోతాయి. మైగ్రేన్ కావచ్చు, టెన్షన్ తలనొప్పి కావచ్చు. లేదా అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన నొప్పి కావచ్చు. ఏదైనా సరే డేను అస్తవ్యస్తం చేస్తుంది. దాని బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. భరించలేని నొప్పికి ఒక్కోసారి విపరీతంగా ట్యాబ్లెట్లు వేసేసుంకుంటారు. దానివల్ల శరీరానికి ఎంత నష్టం జరుగుతుందన్నది పట్టించుకోరు.
జీవనశైలి మార్చుకోవాలి: న్యూరాలజిస్టులు
దాదాపు చాలా మంది తలనొప్పికి కారణం వదిలేసి ట్యాబ్లెట్లు వేసుకోవడం, డాక్టర్లను సంప్రదించడం చేస్తారు. చికిత్సే మార్గం అనుకుంటారు తప్ప..సమస్య రాకుండా ఉండేందుకు ఆలోచించరని న్యూరాలజిస్టులు అంటున్నారు. జీవనశైలిని మార్చుకోవాలని చెప్పినా పట్టించుకోరని చెబుతున్నారు. రోజువారీ అలవాట్లే...తలనొప్పికి ప్రధాన కారణమని తేల్చిచెప్పారు. లైఫ్ స్టైల్ లో ఈ 7 పరిస్థితులు మార్చుకోనంత వరకూ సమస్య తగ్గే ప్రసక్తే లేదని క్లియర్ చెప్పేస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్, లంచ్ అసలు స్కిప్ చేయకూడదు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం, భోజనాన్ని టైమ్‌కు తినకపోవడం, తరచూ ఉపవాసాలు చేయడం వంటి అలవాట్లు శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దేహం అవసరమైన శక్తిని కోల్పోయినప్పుడు, మెదడు తలనొప్పి రూపంలో స్పందిస్తుంది.
రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, నిద్రకు ముందు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ చూడడం వల్ల మెదడుకు సరైన విశ్రాంతి దొరకదు. దీని ప్రభావం నేరుగా తలనొప్పి రూపంలో బయటపడుతుంది. వర్క్ పేరుతో రోజంతా కదలకుండా కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం కూడా రక్త ప్రసరణను తగ్గించి తలనొప్పులను పెంచుతుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి తల బరువుగా అనిపిస్తుంది.
ఒత్తిడి, ఆలోచనలతో మెదడుపై ప్రభావం
వీటన్నిటికన్నా ముఖ్యమైన కారణం..ఒత్తిడి. ఆందోళన, ఆలోచనలు, బాధ్యతలు మెదడు అలసిపోవడానికి దారి తీస్తాయి. మెదడు అలసినప్పుడు, అది శరీరంపై ప్రభావం చూపి తలనొప్పిగా బయటపడుతుంది.
ఈ 7 అలవాట్లను డైలీ లైఫ్ లో భాగం చేసుకోవాలి
అందుకే ఈ 7 అలవాట్లను డైలీ లైఫ్ లో భాగం చేసుకోవాలి. ఉదయం టిఫిన్ మానకూడదు, సమయానికి భోజనం చేయాలి, రాత్రి త్వరగా పడుకోవాలి, నిద్రపోయేముందు అసలు స్క్రీన్ చూడకూడదు, వ్యాయామం కచ్చితంగా చేయాలి. శరీరానికి సరిపడా నీరు తాగాలి. ఒత్తిడి, ఆలోచనలు, ఆందోళనకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. తలనొప్పి నుంచి నిజంగా బయటపడాలంటే, రోజువారీ జీవనశైలిని క్రమబద్ధంగా మార్చుకోవడం తప్పనిసరని కచ్చితంగా చెబుతున్నారు.

