Head bath: స్త్రీలు ఏ రోజుల్లో తల స్నానం చేస్తే మంచిది? ఏ రోజుల్లో చేయకూడదు?
Head bath: హిందూ సాంప్రదాయంలో తల స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వారంలో ఏ రోజుల్లో తల స్నానం చేయవచ్చో, ఏ రోజుల్లో చేయకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

తల స్నానం ఎందుకు చేయాలి?
మన ఇళ్లలో పెద్దలు తరచూ ఈ రోజు తలకు చేయవద్దు లేదా ఈ రోజు తలస్నానం చేస్తే మంచిది అని చెబుతుంటారు. అసలు ఎందుకు అలా అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? పెద్దలు చెప్పారంటే దానికి వెనుక కచ్చితంగా ఒక కారణం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. గ్రహాలు మన ఆరోగ్యం, అదృష్టం, కుటుంబ శాంతిపై ప్రభావం చూపుతాయని ఎంతోమంది అభిప్రాయం. అందుకే తల స్నానం విషయంలో కూడా కొన్ని ఆచారాలు ఇప్పటికీ పాటిస్తారు.
ఏ రోజు చేస్తే శుభం?
జ్యోతిష్యుల మాట ప్రకారం బుధవారం, శుక్రవారం రోజులు తలస్నానం చేయడానికి శుభంగా చెప్పుకుంటారు. బుధవారం.. బుధ గ్రహం ప్రభావం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, శుక్రవారం శుక్రుడి దయతో సౌందర్యం, శుభఫలితాలు దక్కుతాయని అంటారు. చాలామంది మహిళలు కూడా ఈ రెండు రోజుల్లో తలకు స్నానం చేస్తే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సౌకర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. కొందరి నమ్మకంలో ఆదివారం కూడా స్నానం చేయడానికి మంచిదే. కానీ ఎక్కువ ప్రాముఖ్యం మాత్రం బుధ, శుక్ర వారాలకే ఉంది.
ఈ రోజుల్లో వద్దు
అదే సమయంలో మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో తల స్నానం చేయకూడదని చెబుతారు.మంగళవారం తలస్నానం చేస్తే కుటుంబాభివృద్ధికి ఆటంకాలు వస్తాయని అంటారు. గురువారం గురుగ్రహ పూజలకు ముఖ్యమైన రోజు కావడంతో, ఈ రోజు తలకు నీళ్లు పోస్తే గురుడి శుభఫలితాలు తగ్గుతాయని విశ్వాసం. అలాగే శనివారం శని గ్రహం రోజు కావడంతో ఈ రోజు తల స్నానం చేస్తే దురదృష్టం వస్తుందని అంటారు. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ నియమాన్ని కఠినంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు.
శాస్త్రీయ నిరూపణలు లేవు
అయితే ఇవన్నీ పాతకాలపు సంప్రదాయాలు మాత్రమేనని, శాస్త్రీయంగా వీటికి ఎలాంటి ఆధారం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యం పరంగా చూస్తే ఏ రోజు తలకు స్నానం చేసినా హానికరం కాదు. మన శరీరం శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. అయినా చాలా కుటుంబాల్లో ఈ ఆచారాలు ఇంకా గౌరవంగా కొనసాగుతున్నాయి. మీ నమ్మకాలు, వ్యక్తిగత అవసరాలు, ఆసక్తులను బట్టి మీరు ఏ రోజు తలకు స్నానం చేయాలో నిర్ణయించుకుంటే మంచిది.

