Peanut Chikki : రోజు ఒక పల్లిపట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Peanut Chikki Health Benefits: చాలా మంది స్నాక్స్‌గా చాక్లెట్స్ తింటున్నారు. కానీ, వీటిని తినడం వల్ల పంటి సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కాబట్టి చాక్లెట్స్‌కి బదులుగా ప్రతి రోజు వేరుశెనగ పల్లీలు తినడం ఆరోగ్యానికి మేలు. ఆ లాభాలేంటో ?

సంప్రదాయ రుచికి చిరునామా
పల్లి పట్టి అనేది ఎన్నో సంవత్సరాలుగా మన సంప్రదాయ తీపి వంటకాలలో ఒక ముఖ్యమైన వంటకం. పండుగలు, శుభకార్యాలు, సాయంత్ర వేళలో వీటిని ఖచ్చితంగా తయారు చేస్తారు. వేరుశెనగలు, బెల్లం కలయికతో ఈ మిఠాయికి అద్భుతమైన రుచి వస్తుంది. ఈ మిఠాయిని ఇంట్లో సులభంగా తయారుచేయవచ్చు. ఈ తీపి వంటకాన్ని నాణ్యమైన పదార్థాలతో, సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది. పల్లి పట్టి ప్రయోజనాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
వేరుశెనగలు పోషకాల గని:
వేరుశెనగలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటంతో శరీర కండరాలు బలంగా ఉండటానికి, కొత్తకణాలు నిర్మించడానికి ఎంతో అవసరం. వేరుశెనగల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు (healthy fats) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, అందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. వేరుశెనగలు విటమిన్ E, మెగ్నీషియం, ఫోలేట్ వంటి అనేక విలువైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండటంతో శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. రోజూ మితంగా వేరుశెనగలు తీసుకోవడం వల్ల శక్తి, సహనశక్తి, రోగనిరోధక శక్తులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
బెల్లం ఉపయోగాలు
పల్లి పట్టిలో బెల్లంను ఉపయోగిస్తారు. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు. ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరమైనది. చక్కెరతో పోలిస్తే, బెల్లంలో శరీరానికి మేలు చేసే ఖనిజాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తహీనత నివారణకు, ఎముకల బలానికి, శరీర వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. అలాగే, బెల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, శరీరంలో విషపదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
ఎలా తయారు చేయాలి?
కావలసిన పదార్థాలు: వేరుశెనగలు - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు, నీళ్లు - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/4 టీస్పూన్, నెయ్యి - 1 టీస్పూన్
తయారీ విధానం:
- వేరుశెనగలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టండి.
- బాణలిలో బెల్లం, నీళ్లు కలిపి తీగ లాగా పాకం వచ్చే వరకు మరిగించండి.
- ఆ పాకంలో వేయించిన వేరుశెనగలు, యాలకుల పొడి కలిపి బాగా మిక్స్ చేయండి.
- నెయ్యి రాసిన ప్లేట్‌లో మిశ్రమాన్ని పరచి, వేడిగా ఉండగానే ముక్కలుగా కోయండి.
- చల్లారిన తర్వాత ఆ ముక్కలను, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
ప్రయోజనాలు
పల్లి పట్టి శరీరానికి తక్షణ శక్తినిచ్చే సంప్రదాయ మిఠాయి. అలసటగా ఉన్నప్పుడు ఒక్క ముక్క తింటే చాలు.. ఉత్సాహం పెరుగుతుంది. వేరుశెనగల్లో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇందులోని ప్రోటీన్, ఫైబర్ ఆకలిని నియంత్రించి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి. ఇక ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మంచివి. కొన్ని అధ్యయనాల ప్రకారం, వేరుశెనగలు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన చిరుతిండిగా పల్లి పట్టి మంచి ఎంపిక.
మితంగా తీసుకోండి.
ఎంత పోషకాలున్నా, ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడం మంచిదే. వేరుశెనగ మిఠాయిలో బెల్లం ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు లేదా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు పరిమితంగా తినాలి. బయట నుంచి కొనేటప్పుడు శుభ్రత, నాణ్యత తప్పనిసరిగా పరిశీలించాలి. సాధ్యమైతే ఇంట్లోనే తయారుచేసుకుని తినడం ఉత్తమం.
పల్లి పట్టి రుచికరమైనదే కాకుండా పోషకమైన సంప్రదాయ తీపి వంటకం కూడా. తింటున్నప్పుడు దాని సాంప్రదాయ రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా గుర్తుపెట్టుకుని ఆస్వాదించండి.