- Home
- Life
- Health
- Monsoon health tips : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఆహారం తినండి..!
Monsoon health tips : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఆహారం తినండి..!
Monsoon health tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉబ్బరం, తరచుగా మూత్రవిసర్జన, జలుబు వంటి చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఇవి సర్వసాధారణమైనవే. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సహజంగా నియంత్రించుకోవచ్చు. ఇంతకీ ఆహారాపదార్థాలేంటీ?

అల్లం:
వర్షాకాలంలో జలుబు, దగ్గుతో పాటు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు సాధారణమే. ఈ సమస్యలన్నింటికి సహజమైన ఔషధం అల్లం. అల్లంలో ఉండే జీవక్రియను ఉత్తేజపరిచే సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేడి అల్లం టీ తాగడం లేదా ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. వర్షాకాలంలో శరీరాన్ని ఉష్ణంగా, జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచేందుకు అల్లం దైనందిన ఆహారంలో చేర్చుకోవాలి.
అరటిపండు:
అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. సోడియం అధికంగా ఉన్నప్పుడు శరీరంలో నీరు చేరి ఉబ్బరం వస్తుంది, కాబట్టి అరటిపండు తినడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది. వర్షాకాలంలో ఉబ్బరం తగ్గించేందుకు అరటిపండు మంచి సహాయకారి.
దోసకాయ:
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంతో పాటు, నీరు చేరడాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. దోసకాయను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు లేదా తాజా జ్యూస్‌గా తాగవచ్చు. ఇది శరీరానికి చల్లదనాన్ని, తాజాతనాన్ని అందించి, వర్షాకాలంలో సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని తేమగా ఉంచడంలో దోసకాయలాగే ఎంతో సహాయపడుతుంది. శరీరంలో నీరు చేరి ఉబ్బరాన్ని కలిగించే సమస్యను ఇది సహజంగా తగ్గిస్తుంది. అదేకాకుండా, ఇందులో లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. వర్షాకాలంలో పుచ్చకాయ దొరకడం కష్టమే అయినా.. దొరికితే తప్పకుండా తినండి.
ఆకుకూరలు :
ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఫైబర్ మలబద్ధకం, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తట్టుకునే శక్తిని ఇస్తాయి.
ఓట్స్:
ఓట్స్‌లో ఉండే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చుతుంది. అలాగే వీటిని తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అధికంగా తినడం నుంచి నివారించడమే కాక, పేగుల్లో గాలి పేరుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. దాంతో ఉబ్బరం తగ్గుతుంది. వర్షాకాలంలో ఉదయానికి ఓట్స్ సూప్ లేదా ఓట్స్ ఉప్మాగా తీసుకోవడం మంచిది.
సోంపు:
సోంపు సహజ జీర్ణ సహాయకారి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. సోంపును మరిగించి టీలా తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని హాయిగా ఉంచి జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయించడంలో సహాయపడుతుంది.
నీరు:
వర్షాకాలంలో దాహం తక్కువగా ఉన్నా, తగినంత నీరు తాగడం చాలా అవసరం. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ప్రతిరోజూ 8–10 గ్లాసుల నీరు తాగాలి. అవసరమైతే వేడి నీరు తీసుకోండి. వేడి నీరు.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పుదీనా:
పుదీనాలో ఉండే మెంతోల్ జీర్ణవ్యవస్థ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది, దాంతో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనా టీ తాగడం, లేదా ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సౌకర్యంగా ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణ సమస్యలకు ఇది సహజమైన, ప్రభావవంతమైన పరిష్కారం.
సాధారణ చిట్కాలు:
- వర్షాకాలంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్‌లో ఉండే అధిక ఉప్పు వంటివి అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు అధికమవుతాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించడమే మంచిది.
- ఒక్కసారిగా ఎక్కువగా తినకుండా, తక్కువగా చాలాసార్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
- భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- ఈ సాధారణమైన ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.

