Health Tips: 30 ఏళ్లు దాటిన మగవారు తప్పనిసరిగా పాటించాల్సిన ఆరోగ్య నియమాలు ఇవే..
Health Tips: వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. కానీ, పనిభారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడి కారణంగా పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదకరం. 30 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే

ఆరోగ్యకరమైన అలవాట్లు
చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ మనశ్శాంతి, ఆత్మ సమతుల్యత కోసం శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవడం అవసరం. పనిభారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడి కారణంగా పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదకరం. 30 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు తప్పక పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే:
యోగా;
యోగాలో శ్వాస పద్ధతులే కాక, శరీరాన్ని శక్తివంతంగా ఉంచే వ్యాయామాలు కూడా ఉన్నాయి. కొంతమంది పురుషులకు శరీరం గట్టిగా ఉండటం వల్ల ప్రారంభంలో యోగా కష్టం అనిపించొచ్చు, కానీ క్రమం తప్పకుండా చేస్తే శరీరం దృఢంగా, చురుకుగా మారుతుంది. 30 ఏళ్ల తర్వాత యోగా కండరాలు, కీళ్ల నొప్పులు, వంగిన భంగిమ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే శ్వాస పద్ధతులు రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వ్యాయామం:
వెయిట్ లిఫ్టింగ్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, పుష్-అప్స్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు కండరాలను బలపరచి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఇవి శరీర జీవక్రియను వేగవంతం చేసి, టెస్టోస్టెరాన్ హార్మోన్లను సమతుల్యంలో ఉంచడంలో సహాయపడతాయి. ముసలితనానికి బ్రేక్ వేస్తాయి.
మెదడుకు వ్యాయామం
మెదడును చురుగ్గా ఉంచే అలవాట్లు జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి, మతిమరుపును తగ్గిస్తాయి. పజిల్స్ చేయడం, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త భాషలు నేర్చుకోవడం, ధ్యానం చేయడం వంటివి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆహారపు అలవాట్లు
30 నుంచి 40 ఏళ్ల వయసులో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. ఈ వయసులో కూరగాయలు, పండ్లు, డ్రై ప్రూట్స్, విత్తనాలు, లీన్ మీట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాహారం తీసుకోవాలి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యంలో ఉంచి, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాది వంటివి.
నిద్ర
మంచి నిద్ర మెరుగైన ఆరోగ్యానికి చాలా కీలకం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నిద్రలేమి టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు, బరువు పెరగడం, డయాబెటిస్, హార్ట్ డిసీజ్‌ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.