Oral Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు ఫాలోకండి..
Remedies For Bad Breath: నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.

నోటి దుర్వాసనకు చెక్
నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టడానికి చాలామంది మౌత్ ఫ్రెషనర్ లేదా మౌత్ వాష్ వాడుతుంటారు. అయితే వీటిని తరచూ వాడడం మంచిదికాదు. మౌత్ వాష్‌లలో ఉండే రసాయనాలు నోట్లోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే, క్షారతత్వం వల్ల నోట్లో పుండ్లు కావొచ్చు.
దుర్వాసనను నివారించాలంటే.. ముఖ్యంగా తగినంత నీరు తాగాలి. నోరు పొడిబారితే లాలాజల ఉత్పత్తి తగ్గి బ్యాక్టీరియా పెరుగుతాయి. అందువల్ల రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీటిని తాగితే, లాలాజలం పెరిగి నోటిలోని ఆహారపు ముక్కలు, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.
సహజ పద్దతులు
నోటి దుర్వాసనను తగ్గించేందుకు సహజమైన మార్గాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఉదాహరణ కు: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించండి. ఇది సహజ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం నువ్వుల నూనెతో పుక్కిలించడం ద్వారా కూడా నోరు శుభ్రంగా ఉండి దుర్వాసన తగ్గుతుంది. అలాగే, పుదీనా ఆకులు నమలడం, లవంగాలు లేదా యాలకులు నోట్లో వేసుకుని నమలడం వలన నోటికి తాజాదనం అందుతుంది. ఇవన్నీ సహజమైనవి కావడంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
వ్యక్తిగత పరిశుభ్రత
నాలుకపై పేరుకునే బ్యాక్టీరియా, ఆహారపు అవశేషాల వల్ల దుర్వాసన ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజూ నాలుకను శుభ్రంగా చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం టాగ్ క్లీనర్ లేదా టూత్ బ్రష్ వెనక భాగాన్ని ఉపయోగించవచ్చు.
అలాగే, ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండు సార్లు పళ్ళు తోముకోవడం ఉత్తమం. ఎందుకంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయే ఆహారపు ఆవశేషాలు దుర్వాసనకు కారణమవుతాయి.
ఈ సమస్య నివారించేందుకు, వారానికి ఒకసారి డెంటల్ ఫ్లాస్ ఉపయోగించడం మంచి అలవాటు. ఇది పళ్ళ మధ్యలో చేరిన సూక్ష్మమైన అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నోటి దుర్వాసనకు వంటింటి చిట్కాలు
ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి, ఉదయం భోజనానికి ముందు పుక్కిలిస్తే, నోటి pH స్థాయి సమతుల్యంలోకి వస్తుంది. ఇది చెడు బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ ఫలాలను ఎక్కువగా తీసుకోవడం వలన లాలాజలం ఉత్పత్తి పెరిగి, నోరు తాజాగా మారుతుంది.
ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పచ్చిగా తినడాన్ని తగ్గించడం మంచిది, ఎందుకంటే ఇవి నోటిలో దుర్వాసనకు కారణమవుతాయి. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు కూడా నోటి దుర్వాసనకు ప్రధాన కారకాలు. వీటిని మానితే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నోటి దుర్వాసనకు కారణాలు
కడుపులో పుండ్లు, పేగుల సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. కాబట్టి కడుపు, పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం వలన అజీర్ణం, దుర్వాసన వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
తక్కువ మసాలా, తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవాలి. పై సూచనలు పాటించినా కూడా దుర్వాసన తగ్గకపోతే, దంత వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే, పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ళ వ్యాధులు, లేదా ఇన్ఫెక్షన్లు కూడా దుర్వాసనకు కారణమవుతాయి.