పళ్లను బలంగా, శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల దంతాలు దెబ్బతింటాయి. కొందరు ఆరెంజ్, నిమ్మరసం లాంటి పుల్లటి రుచి ఉన్న డ్రింక్స్ తాగిన వెంటనే బ్రష్ చేసుకుంటారు. అది పళ్లకు అస్సలు మంచిది కాదట. ఎందుకో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా చాలామందికి ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ లేదా నిమ్మరసం తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆ డ్రింక్ తాగిన వెంటనే బ్రష్ చేసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు అనుకుంటారు కొంతమంది. కానీ ఇది పళ్లకు అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం లాంటి ఆమ్ల పానీయాలు శరీరానికి మంచివే అయినప్పటికీ.. వాటిలోని ఆమ్లం పళ్లపై ఉండే ఎనామిల్ ని బలహీనపరుస్తుంది. డ్రింక్ తాగిన వెంటనే బ్రష్ చేసుకుంటే ఎనామిల్ తొలగిపోయి, పళ్లు బలహీనపడతాయి. దీనివల్ల దంతాలు సున్నితత్వాన్ని కోల్పోయి.. శాశ్వతంగా దెబ్బతింటాయి.
ఎప్పుడు బ్రష్ చేసుకోవాలి?
దంత వైద్యుల సలహా ప్రకారం... ఆమ్ల పానీయాలు తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకూ బ్రష్ చేసుకోకూడదు. ఈ లోపు లాలాజలం నోటి pH స్థాయిని సరిచేసి, ఎనామిల్ బలాన్ని పునరుద్ధరిస్తుంది. వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలనుకుంటే.. నీళ్లతో పుక్కిలించాలి. లేదా షుగర్ లేని చూయింగ్ గమ్ నమలాలి. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచి.. నోటిని శుభ్రపరుస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి!
- ఆమ్ల పానీయాలు తాగేటప్పుడు స్ట్రా వాడండి. దీనివల్ల పళ్లకి ఆమ్లం తక్కువగా తగులుతుంది.
- డ్రింక్ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగాలి.
- మెత్తటి బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి.
- ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. ఇది ఎనామిల్ ని రక్షిస్తుంది.
ఇవి అస్సలు చేయద్దు:
- ఆమ్ల పానీయం తాగిన వెంటనే బ్రష్ చేసుకోవద్దు.
- గట్టి బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ వాడటం మంచిది కాదు. ఇది ఎనామిల్ ని దెబ్బతీస్తుంది.
- ఆమ్ల పానీయాలు తరచుగా తాగద్దు. ముఖ్యంగా భోజనాల మధ్య.
ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యమే.. కానీ సరైన పద్ధతిలో పాటించకపోతే మంచి అలవాట్లు కూడా హానికరంగా మారుతాయి. నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ తో మీ రోజుని ప్రారంభించడం మంచిదే.. కానీ బ్రష్ చేసుకునే ముందు కాస్త ఆగండి. ఈ చిన్న జాగ్రత్త మీ పళ్లని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.
