Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా నడవాలో తెలుసా.?
Heart Health: గుండె ఆరోగ్యం బాగుండాలంటే నడక చాలా సులభమైన మార్గం. ఖరీదైన జిమ్ అవసరం లేదు. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. రోజూ కొద్దిసేపు నడిచినా గుండె బలంగా ఉంటుంది. అయితే ఎలా నడుస్తామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఎంత వేగంతో నడవాలి?
డాక్టర్లు, పరిశోధకులు చెబుతున్నది ఒకటే. నెమ్మదిగా నడక కంటే వేగంగా నడక ఎక్కువ లాభం ఇస్తుంది. 2023లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం గంటకు 3 నుంచి 4.5 మైళ్ల వేగంతో నడిచేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా కనిపించింది. సాధారణంగా చెప్పాలంటే ఒక మైలు దూరాన్ని 13 నుంచి 20 నిమిషాల్లో పూర్తిచేసే వేగం ఇది.
వేగంగా నడక వల్ల కలిగే ప్రయోజనాలు
వేగంగా నడిచే వారిలో
* గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది
* స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
* మెదడు పనితీరు మెరుగవుతుంది.
* డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గుతుంది
ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు వేగంగా నడిచినా శరీర ఫిట్‌నెస్ మెరుగవుతుంది. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. అకాల మరణ ప్రమాదం దాదాపు 15 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
రోజుకు ఎంతసేపు నడవాలి?
అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ప్రకారం రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఆగకుండా నడిచితే గుండెపై మంచి ప్రభావం చూపుతుంది. 30 నిమిషాలు వేగంగా నడకను మిడియం ఇంటెన్సిటీ వ్యాయామంగా పరిగణిస్తారు. దీనినే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా సూచిస్తోంది. ఎక్కువ సమయం లేకపోయినా కొద్దిసేపు సరైన విధానంలో నడక చేస్తే చాలు.
ఎవరికీ ఎక్కువ లాభం?
శారీరకంగా తక్కువ చురుకుగా ఉండే వారికి వేగంగా నడక మరింత ఉపయోగకరం. వయసు పెరుగుతున్న కొద్దీ క్రమం తప్పకుండా నడవడం అలవాటు చేసుకుంటే గుండె సమస్యలు దరి చేరవు. రోజూ చేసే చిన్న మార్పే భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది.
నడక చాలా ముఖ్యం
మొత్తం మీద వాకింగ్ అనేది చిన్న అలవాటే అయినా ఫలితం మాత్రం చాలా పెద్దది. రోజూ కొద్దిసేపు వేగంగా నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యంగా జీవించాలంటే నడకను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

