Banana: మీరు కొన్న అరటి పండు.. కెమికల్స్‌తో పండించారా? న్యాచురల్‌వా? ఇలా తెలుసుకోండి
Banana: అరటిపండును పేదల యాపిల్‌గా చెబుతుంటారు. ఇందులోని మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే అరటి పండును నేచురల్‌గా కాకుండా కెమికల్స్‌తో పండిస్తున్నారు. మరి కెమికల్స్‌తో పండించిన అరటిని ఎలా గుర్తించాలంటే.?

బయట పసుపు.. లోపల ప్రమాదం
ఒకప్పుడు అరటిపండు అంటే భద్రమైన ఆహారం అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో కనిపించే చాలా అరటిపండ్లు సహజంగా పండినవేనా అనే అనుమానం కలుగుతోంది. త్వరగా అమ్మకానికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ప్రమాదకర రసాయనాలను (కార్బైడ్) ఉపయోగిస్తున్నారు. చూడటానికి అందంగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యానికి మాత్రం ముప్పుగా మారుతున్నాయి.
రెండింటి మధ్య తేడా ఎలా గుర్తించాలి.?
సహజంగా అరటిపండు పండే సమయంలో ‘ఇథిలీన్’ అనే వాయువు విడుదల అవుతుంది. ఇది నెమ్మదిగా పండును పూర్తిగా పండేలా చేస్తుంది. కానీ కాల్షియం కార్బైడ్ వాడితే ‘ఎసిటలీన్’ అనే వాయువు విడుదలై పండును లోపల పండకుండా, బయట తొక్కను మాత్రమే పసుపు రంగులోకి మార్చుతుంది. దీంతో పండు బయట అందంగా కనిపించినా, లోపల ముడిగా ఉంటుంది.
రంగు చూస్తేనే అసలు నిజం తెలుస్తుంది
రసాయనాలతో పండించిన అరటిపండ్లు మొత్తం ఒకేలా మెరిసే పసుపు రంగులో ఉంటాయి. చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సహజంగా పండిన అరటిపండ్లపై చిన్న చిన్న గోధుమ లేదా నల్ల మచ్చలు ఉంటాయి. పచ్చదనం కొద్దిగా కనిపించడం కూడా సహజ పండుదలకు సంకేతం.
వాసన, తొక్క, లోపలి భాగం చెప్పే సూచనలు
సహజంగా పండిన అరటిపండు దగ్గరికి తీసుకెళ్తే తీయని వాసన వస్తుంది. కానీ రసాయన పండ్లకు వాసనే ఉండదు. తొక్క చాలా మెరుస్తూ, బొమ్మలాగా కనిపిస్తుంది. పండును కోసినప్పుడు లోపలి భాగం గట్టిగా, తెల్లగా ఉంటే అది కృత్రిమ పండుకు స్పష్టమైన సంకేతం. సహజ పండు మాత్రం మెత్తగా, సమానంగా పండి ఉంటుంది.
సురక్షితంగా అరటిపండ్లు తినాలంటే ఇలా చేయండి
చాలా అందంగా కనిపించే పండ్లను చూసి ఆకర్షితులు కావొద్దు. కొంచెం పచ్చగా ఉన్న అరటిపండ్లను కొనుగోలు చేసి ఇంట్లోనే సహజంగా పండించుకోవడం ఉత్తమం. స్థానిక రైతుల వద్ద లేదా చిన్న దుకాణాల్లో దొరికే పండ్లకు ప్రాధాన్యం ఇవ్వండి.

