Health Tips: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని చాలామంది చెబుతారు. తిన్న తర్వాత బెల్లం ముక్క తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

భోజనం తర్వాత బెల్లం తింటే ఏమవుతుంది?
భోజనం చేసిన తర్వాత స్వీట్స్ తినాలని చాలామందికి ఉంటుంది. అయితే చక్కెరతో తయారుచేసిన స్వీట్స్ కంటే చిన్న బెల్లం ముక్క తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. చాలా ప్రాంతాల్లో భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తినే సంప్రదాయం కూడా ఉంది. అయితే ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇక్కడ చూద్దాం.
మెరుగైన జీర్ణక్రియ
బెల్లం జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే బెల్లం తినడం వల్ల ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. బెల్లంలో సహజంగా ఉండే ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇవి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతాయి. అంతేకాదు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.
కాలేయ పనితీరు
బెల్లం శరీరంలోని వ్యర్థ, హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
మెరుగైన రక్త ప్రసరణ
బెల్లం తినడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉన్న ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ B వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
బెల్లం ఎంత మోతాదులో, ఎప్పుడు తింటే మంచిది?
భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ మితంగా తీసుకోవడం ముఖ్యం. 5 నుంచి 10 గ్రాముల (చిన్న ముక్క) బెల్లం తినవచ్చు. ఎక్కువ బెల్లం తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే బెల్లం తినడం మంచిది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- స్థానికంగా తయారుచేసిన లేదా సేంద్రీయ బెల్లంను ఉపయోగించడం మంచిది.
- చాలా పాత లేదా పాడైన బెల్లం తినకూడదు. దానివల్ల కొత్త సమస్యలు రావచ్చు.
- పిల్లలకు కూడా తగిన మోతాదులో బెల్లం ఇవ్వవచ్చు.
- భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ఆరోగ్యానికి, ముఖ్యంగా జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది కడుపును తేలికగా ఉంచుతుంది. శరీరానికి శక్తినిస్తుంది.