అతి మూత్రవిసర్జన అనారోగ్యానికి సంకేతమా? కారణాలేంటి?
Frequent Urination: కొంతమందికి తరచుగా మూత్రవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. దీన్ని డయాబెటిస్ లక్షణంగా కొందరు భావిస్తారు. కానీ ఇది మూత్ర మార్గములో సమస్యకు సంకేతం కావచ్చు. ఇంతకీ వైద్యులు ఏం చెబుతున్నారు? కారణాలేంటీ? అని తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

అతిమూత్రం ?
సాధారణంగా ఒక రోజులో 6 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేస్తాం. అయితే దీనికంటే ఎక్కువగా సార్లు, ముఖ్యంగా రాత్రిపూట చాలాసార్లు మూత్రవిసర్జన చేస్తున్నట్టయితే.. దీనిని నాక్టూరియా అంటారు. అది అతిమూత్రం (frequent urination) లక్షణం కావొచ్చు. మూత్రవిసర్జన చేసిన తర్వాత కూడా పూర్తిగా ఖాళీ అయినట్టు అనిపించకపోవడం, తరుచూ మూత్రవిసర్జన చేయాలనే ఆతురత, లేదా మూత్రాన్ని అదుపు చేయలేకపోవడం వంటి సమస్యలు ఉంటే.. ఇవి కూడా అతిమూత్ర వ్యాధికి సంబంధించిన లక్షణాలుగా పరిగణించవచ్చు.
మూత్ర విసర్జనలో సమస్యలు
మన శరీరంలో మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలు, మూత్రం బయటకు వెళ్లే మార్గం కలిసి మూత్ర మార్గ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థలో ఏదైనా భాగంలో లోపం ఏర్పడితే, దాన్ని మూత్ర మార్గ సమస్యగా పరిగణిస్తారు. ఇది మూత్రాన్ని నిల్వ చేయడంలో, బయటకు పంపడంలో ఇబ్బందులను కలిగించవచ్చు. మూత్ర మార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్స్.. కింది భాగానికి చెందినవాటిని "మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Bladder Infection)", పై భాగానికి చెందినవాటిని “మూత్రపిండ ఇన్ఫెక్షన్ (Kidney Infection)” గా పిలుస్తారు.
కారణాలు
అతిమూత్రం (Frequent urination) అనేది మూత్ర మార్గంలో సమస్య. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు: మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం, మూత్రాశయం గట్టిగా కుంచించుకోవడం లేదా పూర్తిగా వదులుకోకపోవడం, మూత్రాశయ నియంత్రణలో ఉన్న కండరాల బలహీనత లేదా పని తీరులో లోపం వంటివి.
ఇవే కాకుండా, ఓవరాక్టివ్ బ్లాడర్ (Overactive Bladder - OAB) ఉన్నవారికి మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా కూడా మూత్రవిసర్జన చేయాలనే ఆతురత, తరచూ వాపులు రావడం, రాత్రిపూట లేచి మరల మరల మూత్రవిసర్జన చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య వారి దైనందిన జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇతర లక్షణాలు
- మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట. ఇది సాధారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ (UTI) సంకేతం కావచ్చు.
- కొన్నిసార్లు, దగ్గు, తుమ్ము, నవ్వు లేదా శారీరక శ్రమ సమయంలో మూత్రం లీక్ కావడం మూత్ర నియంత్రణలో లోపం వల్ల కలిగే సమస్య.
- మూత్రవిసర్జన తర్వాత కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోయినట్టు అనిపించడం, ముదురు రంగులో, మబ్బుగా ఉన్న మూత్రం, దుర్వాసనతో ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
- మరికొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం కనిపించవచ్చు. జ్వరం, చలి, కడుపు లేదా కటి నొప్పి వంటి లక్షణాలు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్‌కు సూచనలుగా ఉంటాయి.
- మూత్రపిండ ఇన్ఫెక్షన్ అయితే.. వీపు లేదా ప్రక్క భాగంలో నొప్పి రావచ్చు. అలాగే, అలసట, వికారం, వాంతులు వంటి లక్షణాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా మూత్రపిండాల సమస్యలను సూచించవచ్చు.
వైద్యుల సలహా
నిర్లక్ష్యం చేయడం లేదా ఇంటి చిట్కాలతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. అసలు కారణాన్ని తెలుసుకొని, వైద్య సలహాతో సరైన పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవడం అత్యంత ముఖ్యం. గర్భిణీ స్త్రీలు, డయాబెటిస్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువవారు లేదా మూత్ర మార్గంలో అడ్డంకులు ఉన్నవారు ఈ సమస్య తీవ్రం కాకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.