Frequent Urination : పదే పదే టాయిలెట్ కు వెళుతున్నారా? దీనికి ఈ వ్యాధులే కారణం కావొచ్చు..
Frequent Urination : పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా తరచుగా మూత్రవిసర్జన చేస్తున్నారా? అయితే మీకు ఈ జబ్బులు సోకి ఉండొచ్చ. చెక్ చేసుకోండి.

Frequent Urination : మన రోజు వారి జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. అవి వివిధ జబ్బులకు సంకేతం కావొచ్చు. కానీ మనం మాత్రం వాటిని అస్సలు పట్టించుకోం. ఇది చిన్న సమస్యే అని తీసిపారేస్తుంటాం. ఇలాంటి సమస్యలే మన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి.
ఇలాంటి అనారోగ్య సమస్యల్లో తరచుగా మూత్రం రావడం ఒకటి. కానీ ఈ సమస్యను అంత తేలిగ్గా తీసిపాయేడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు గురైన వారిలో మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలగడంతో పాటుగా తరచుగా మూత్రం కూడా వస్తుంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రాశయం, మూత్రనాళం, మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.
డయాబెటీస్ .. డయాబెటీస్ పేషెంట్లలో కూడా ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. తరచుగా మూత్రం వస్తూ ఉంటే మీరు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటీస్ బారినపడే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రపిండాలు దానిని శరీరం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయంలో మూత్రం తరచుగా వస్తుంది.
హైపర్ థైరాయిడిజం.. హార్మోన్ల సమస్యలు కూడా తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ‘హైపర్ థైరాయిడిజం’అని పిలువబడే పరిస్థితి. దీనిలో థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
ప్రోస్టేట్ గ్రంధిలో సమస్యలు.. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంధి దెబ్బతినడం వల్ల కూడా అప్పుడప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటారు. దీనికి సకాలంలో చికిత్స్ తీసుకోకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
మూత్రపిండాల్లో రాళ్లు.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే కూడా తరచుగా మూత్రవిసర్జన చేసే అవకాశం ఉంది. మూత్రపిండాల్లో రాళ్లున్నవారికి మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి పుడుతుంది.
ఆందోళన.. తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొంటున్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆందోళన సమస్య ఉన్నవారిలో కండరాల పనితీరు అదుపుతప్పుతంది. మూత్రాశయ కండరాలపై నియంత్రణ కోల్పోయినప్పుడు తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.