Health tips: గుడ్లు ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మోతాదుకు మించి తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. మరి గుడ్డు ఎలా తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Can Diabetic Patient Eat Egg Daily
రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకునేవారు తమ ఆహారంలో గుడ్డును చేర్చుకోవచ్చు. కానీ గుడ్డును ఎక్కువగా తీసుకుంటే అది రక్తంలో చక్కెర స్థాయిని పెంచి టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్డు తింటే షుగర్ వస్తుందా?
సాధారణంగా అప్పుడప్పుడు గుడ్డు తింటే డయాబెటిస్ రాదు. కానీ రోజూ గుడ్లు తింటే, వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలి అధ్యయనం హెచ్చరిస్తోంది. రోజూ గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అమెరికాలో ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి 39 శాతం వరకు పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.
అధ్యయనం ప్రకారం..
గుడ్డును సరైన మోతాదులో తినేవారి శరీరంలో ప్రోటీన్ సమతుల్యంగా ఉంటుంది. అదే సమయంలో గుడ్డును ఎక్కువగా తినేవారికి 60% వరకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అందులోనూ ఈ ప్రభావం పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనంలో 50 ఏళ్లు నిండిన వారు 8,545 మంది పాల్గొన్నారు. వారిలో గుడ్డు తినే అలవాటు, డయాబెటిస్ గురించి వివరాలు సేకరించారు. అందులో రోజుకు రెండు గుడ్ల కంటే ఎక్కువ తినేవారిలో చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉందని కనుగొన్నారు.
ఎన్ని గుడ్లు తినాలి?
కొంతమంది రోజుకు మూడు పూటలా గుడ్లు తింటారు. కానీ అలా మోతాదుకు మించి తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావడమే కాకుండా డయాబెటిస్ కూడా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రోజుకో గుడ్డు తినడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వారంలో మూడు రోజులు ఒక గుడ్డు చొప్పున తినచ్చు. ఇలా తింటే ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మిగిలిన రోజుల్లో రెండు గుడ్లు అదీ తెల్లసొన మాత్రమే తినాలని సూచిస్తున్నారు.
గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఇవి రెండూ చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. కాబట్టి నిపుణులు సూచించిన విధంగా గుడ్లు తినడం మంచిది. గుండె సమస్య లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్లు తినడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
