Period Beliefs: బొప్పాయి తింటే నిజంగానే పీరియడ్స్ తొందరగా వస్తాయా?
బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో మన అందరికీ తెలుసు. చాలా సమస్యలకు బొప్పాయితో చెక్ పెట్టవచ్చు. అయితే బొప్పాయి తినడం వల్ల పీరియడ్స్ తొందరగా వస్తాయని చాలామంది చెబుతుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం.

బొప్పాయికి పీరియడ్స్ కి సంబంధం ఏంటి?
నెలసరి.. ఒక సహజమైన ప్రక్రియ. కొంతమందికి పీరియడ్స్ నెలకు ఒకసారి వస్తే.. మరికొందరికి రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయని చాలామంది చెబుతుంటారు. పీరియడ్స్ కి, బొప్పాయికి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయా? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బొప్పాయిలోని ముఖ్యమైన పోషకాలు:
బొప్పాయిలో విటమిన్లు, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి పేగుల ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయిలోని క్యారోటీనాయిడ్లు.. శరీరానికి శక్తినివ్వడంతోపాటు, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి.
బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయా?
బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ రుతుచక్రానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
బొప్పాయిని ఎవరు తినకూడదు?
బొప్పాయిలో ఉండే పాపైన్.. గర్భాశయ కదలికలను ప్రేరేపించవచ్చని.. ఇది గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఉందని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణులు బొప్పాయిని అధికంగా తీసుకోవడం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా పండిన బొప్పాయిని తగిన మోతాదులో తినడం సురక్షితమని చెబుతున్నారు.