Angry When Hungry: ఆకలి వేసినప్పుడు మీకు కోపం వస్తోందా? కారణం ఇదే..
Angry When Hungry: మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు ‘ఆకలేస్తోంది’ అని కోపంగా, చిరాకుగా చెబుతారు. అదేంటి! ఆకలేస్తే మామూలుగా చెప్పొచ్చు కదా.. కోపంగా చెప్పడం ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఓ అద్భుతమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కోపానికి కారణం ఉంది..
ఆకలి వేసినప్పుడు చాలా మంది ఆకలేస్తోందని కోపంగానే చెబుతారు. సరిపడా ఫుడ్ పెట్టకపోయినా విసుగ్గానే అడుగుతారు. అదేదో ముందే అడిగినట్టుగా, రెండు, మూడు సార్లు అడిగినా పెట్టలేదన్న భావనతో విసుక్కుంటూ ఆకలేస్తోందని అంటారు. ఇది మీరు కూడా గమనించే ఉంటారు. కాని సాధారణ విషయమేనని పెద్దగా పట్టించుకోరు. కాని ఆకలేసినప్పుడు కోపం, చిరాకు, విసుగు రావడానికి సైంటిఫిక్ కారణం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వైద్యులు ఏమన్నారంటే..
మనం వెల్లడిచేసే భావోద్వేగాలకు, ఆహారానికి సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆకలి వేసినప్పుడు మైండ్ భావోద్వేగానికి గురై కోపంగా బయటకు వస్తుంది. దీనికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడుకు ఎనర్జీ కావాలి
సాధారణంగా మెదడు యాక్టివ్ గా పనిచేయాలంటే ఎనర్జీ కావాలి. మెదడు తనకు కావాల్సిన ఎనర్జీ కోసం రక్తంలోని గ్లూకోజ్ ని ఉపయోగించుకుంటుంది. అయితే ఆకలి వేసినప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో మెదడుకు కావాల్సిన శక్తి సక్రమంగా అందదు. అప్పుడు మెదడు భావోద్వేగానికి గురవుతుంది. అప్పుడే మనలో కోపం, చిరాకు, విసుగు మొదలవుతాయి.
ఈ హార్మోన్లు వల్లే సమస్య..
బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు కార్టసాల్, అడ్రినలిన్ అనే ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అప్పుడే కోపం, చిరాకు బయటపడతాయి. ఆకలి వేసినప్పుడు ఈ హార్మోన్ల విడుదల మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు. కొంత మంది ఆకలి వేసినప్పుడు చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతారు.
దీనికి పరిష్కారం ఇదే..
ఆకలి వేసినప్పుడు కోపం ఎక్కువగా వచ్చే వారు వెంటనే ఏదైనా చాక్లెట్ లేదా ఫ్రూట్ తినడం మంచిది. లేదా ఇవి బ్యాగులో పెట్టుకొని దగ్గర పెట్టుకోవడం మంచిది. ఆకలి వేసినప్పుడు వెంటనే తింటే ఎవరిపైనా కోప్పడాల్సిన అవసరం రాదు. రిలేషన్స్ పాడవకుండా ఉంటాయి.

