Hair Care: ఈ షాంపూలు జుట్టు డీప్ క్లీనింగ్ కు బెస్ట్ సొల్యూషన్
Hair Care: షాంపూ చేసినా జుట్టు శుభ్రంగా లేదా? ఆయిలీ ఫీలింగ్, డల్‌నెస్ వెనుక అసలు కారణం జుట్టుపై పేరుకుపోయే మురికే అని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యకు క్లారిఫైయింగ్ షాంపూలు ఉపయోగపడతాయంటున్నారు డెర్మటాలజిస్టులు. కానీ దానికి ఓ ప్లానింగ్ ఉందట.

ఈ clarifying shampoos వాడితే సమస్యను చెక్ పెట్టొచ్చు
జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా రాలిపోవడం, పగిలిపోవడం, డేండ్రఫ్ రావడం, కుదుళ్లలో వెంట్రుకల బలం తగ్గిపోవడం, చెమట రావడం, మాడుపై ఆయిల్స్ ఉత్పత్తి అవడం, కంటిన్యూస్ గా వాడే హెయిర్ ప్రొడక్ట్స్ అవశేషాలు పేరుకుపోవడం జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం మనం తినే ఆహారంతో పాటు, షాంపూల ప్రభావం కూడా ఉంటుంది. అయితే నిపుణులు చెబుతున్న ఈ clarifying shampoos వాడితే సమస్యను చెక్ పెట్టొచ్చు.
ఇవి జుట్టుకు హాని చేస్తాయా? ఎంతవరకు ఉపయోగించాలి?
క్లారిఫైయింగ్ షాంపూలు (clarifying shampoos) జుట్టు, తల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు పూర్తిగా తొలగించడంలో సహాయపడతాయి. అయితే ఇవి జుట్టుకు హాని చేస్తాయా? ఎంతవరకు ఉపయోగించాలి? అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని గురించి ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే..
డీప్ క్లీనింగ్ కోసం క్లారిఫైయింగ్ షాంపూలు
జుట్టు సంరక్షణలో సరైన షాంపూను ఎంచుకోవడం ఎంతో అవసరం. మాయిశ్చరైజింగ్ షాంపూలు జుట్టును తేమగా ఉంచితే, క్లారిఫైయింగ్ షాంపూలు మాత్రం డీప్ క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇటీవల మార్కెట్‌లో క్లారిఫైయింగ్ షాంపూలకు డిమాండ్ బాగానే పెరిగింది. జుట్టులో పేరుకుపోయిన తొలగిస్తుందనే కారణంతో రెగ్యులర్ షాంపూలుగా వాడేస్తున్నారు. అయితే డెర్మటాలజిస్టులు మాత్రం ఈ అలవాటు జుట్టుకు హానికరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తరచూ వాడటం అస్సలు మంచిది కాదు
సాధారణంగా మన జుట్టుపై రోజూ చెమట, ధూళి మాత్రమే కాదు, హెయిర్ జెల్స్, స్ప్రేలు, సీరమ్‌లు, ఆయిల్ అవశేషాలు పేరుకుపోతుంటాయి. వేడినీరు స్నానం, స్విమ్మింగ్ పూల్‌లోని క్లోరిన్ వల్ల కూడా జుట్టుపై ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు కడిగినా శుభ్రంగా అనిపించకపోవడం, బరువుగా అనిపించేలా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ క్లారిఫైయింగ్ షాంపూలు చాలా హెల్ప్ చేస్తాయి.
మార్కెట్లో దొరికే క్లారిఫైయింగ్ షాంపూల్లో అధిక స్థాయిలో పీహెచ్ లెవల్స్, స్ట్రాంగ్ సర్ఫాక్టెంట్స్ ఉంటాయి. ఇవి జుట్టుపై పేరుకుపోయిన అన్ని రకాల అవశేషాలను బలంగా తొలగిస్తాయి. డీప్ క్లీనింగ్ చేస్తుంది. అయితే ఇదే సమయంలో తల చర్మాన్ని రక్షించే సహజ నూనెలను కూడా పూర్తిగా తీసేస్తాయి. అందుకే వీటిని తరచుగా వాడటం జుట్టుకు మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడకూడదు
ముఖ్యంగా డ్రై స్కాల్ప్ లేదా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారికి క్లారిఫైయింగ్ షాంపూలు.. సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది. సహజ నూనెలు పోవడం వల్ల మాడు మరింత పొడిబారి, దురద, చుండ్రు, ఫ్రీజీ హెయిర్, హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలు రావచ్చు. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు, తరచుగా స్టైలింగ్ ఉత్పత్తులు వాడేవారు, స్విమ్మింగ్ చేసే వారు మాత్రం పరిమితంగా క్లారిఫైయింగ్ షాంపూను వాడవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం, ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు 2 నుంచి 3 వారాలకు ఒకసారి, నార్మల్ స్కాల్ప్ ఉన్నవారు నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారు 4 నుంచి 6 వారాలకు ఒకసారి మాత్రమే వాడాలి.
ట్రెండ్‌ను చూసి రెగ్యులర్ షాంపూలుగా వాడితే జుట్టు దెబ్బతినే ప్రమాదం
ఈ క్లారిఫైయింగ్ షాంపూలు వాడే విధానం కూడా చాలా కీలకం. తడి జుట్టుపై చాలా కొద్దిగా షాంపూను అప్లై చేసి, ఒక నిమిషంలోపే కడగాలి. ఎక్కువ సేపు ఉంచడం వల్ల జుట్టు డ్రై అయిపోతుంది. తరువాత తప్పనిసరిగా కండిషనర్ లేదా హెయిర్ మాస్క్ వాడాలి. ఇది జుట్టులో తేమను తిరిగి అందించడంలో సహాయపడుతుంది.
డెర్మటాలజిస్టులు చెప్తున్నది ఏంటంటే..క్లారిఫైయింగ్ షాంపూలు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన ఉత్పత్తులు. ట్రెండ్‌ను చూసి రెగ్యులర్ షాంపూలుగా వాడితే జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. సరైన విధంగా వాడినప్పుడే ప్రయోజనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

