watermelon: పుచ్చకాయలోని ఈ తెల్లటి పార్ట్‌ని తింటున్నారా? ఏమవుతుందో తెలుసా..
సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. దాదాపు 90 శాతం నీటితో ఉండే పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వాటర్ మిలన్‌ను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

water melon
వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించడంలో పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పుచ్చకాయ ముక్క తింటే చాలు కొన్ని గంటల పాటు దాహం అనేదే వేయదు. ఇందులోని వాటర్ కంటెంట్ దీనికి కారణం. ఇక సమ్మర్‌లో సహజంగా వచ్చే డీహైడ్రేషన్ సమస్యకు కూడా పుచ్చకాయతో చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా పుచ్చకాయలోని లైకోపీన్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
water melon
ఇక పుచ్చకాయలో పొటాషియం, సిట్రులిన్ ఉండటంతో రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. హైబీపీతో బాధపడేవారు పుచ్చకాయ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక జీర్ణ సంబంధిత సమస్యలను కూడా పుచ్చకాయ దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పుచ్చకాయతో ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే మనలో చాలా మంది పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తింటారు. మిగిలిన ఆకుపచ్చ తొక్కతో పాటు దానికి అంటుకుని ఉండే తెల్లటి భాగాన్ని పారేస్తుంటారు. అయితే ఈ తెల్లటి భాగం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా.? పుచ్చకాయలోని ఈ తెల్లటి భాగంలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోని రక్త నాళాలను విస్తరించేలా చేయడంలో ఉపయోగపడుతుంది.
యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం సిట్రులిన్ కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ తెల్లటి భాగాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం చెబుతోంది.
ఈ తెల్లటి భాగంలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీనిని తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావ కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.