Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి చాలామంది షాంపూలు, ఆయిల్స్ వంటివి వాడుతుంటారు. కానీ జుట్టు ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా, వేగంగా పెరగాలంటే రెగ్యులర్ గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

జుట్టు పెరగాలంటే తినాల్సిన ఫుడ్స్
సాధారణంగా జుట్టు నల్లగా కనిపించడానికి కారణం.. మెలానిన్ అనే పిగ్మెంట్. శరీరంలో మెలానిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి అయితే జుట్టు సహజంగా నల్లగా ఉంటుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ మెలానిన్‌కు కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో ఎక్కువగా లభిస్తాయి. కొన్ని ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టు బలంగా, వేగంగా పెరుగుతుంది.
నువ్వులు
నువ్వుల్లో ఉండే కాల్షియం, జింక్ వంటివి మెలానిన్ పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా నల్ల నువ్వులు శరీరానికి కావాల్సిన మైక్రో-మినరల్స్‌ను అందించి జుట్టు నల్లటి రంగును నిలుపుతాయి. రోజూ ఒక చెంచా నల్ల నువ్వులు లేదా నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ప్రోటీన్ ఫుడ్
ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. కాబట్టి బాదం, వేరుశనగలు, పిస్తా, కాజు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇవి ప్రోటీన్‌తో పాటు బయోటిన్ ని కూడా అందిస్తాయి. బయోటిన్ జుట్టు పెరుగుదలకు అత్యవసరం. నట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు తల చర్మానికి సహజ మాయిశ్చర్‌ను అందించి, జుట్టు ఊడకుండా కాపాడుతాయి.
అవిసె గింజలు
ఆముదం గింజలు, అవిసె గింజలు కూడా జుట్టుకి ప్రత్యేకమైన ప్రయోజనం కలిగిస్తాయి. వీటిలో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ తల చర్మానికి రక్త ప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. రోజూ ఒక చెంచా అవిసె గింజల పొడి లేదా స్మూతీతో కలిపి తీసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆకుకూరలు
పాలకూర, మెంతికూర, గోంగూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ C లు సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హెమోగ్లోబిన్‌ను పెంచుతుంది. తల చర్మానికి సరైన రక్తప్రసరణ ఉంటే జుట్టు అద్భుతంగా పెరుగుతుంది. విటమిన్ C జుట్టు వేర్లను బలపరచడానికి అవసరమైన కొల్లాజెన్‌ను పెంచుతుంది.
కూరగాయలు, పండ్లు
క్యారెట్, బీట్‌రూట్, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తాయి. జుట్టు మెరిసేలా చేస్తాయి. అలాగే కొబ్బరి పాలు, నీళ్లు కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుడ్లు
గుడ్డులో ఉండే సల్ఫర్, హై క్వాలిటీ ప్రోటీన్ జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తాయి. గుడ్లు.. జుట్టు రూట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్లను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అలాగే విటమిన్ E ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
ఉసిరికాయ
ఉసిరికాయ జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ C జుట్టు వేర్లను బలపరచి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉసిరి పొడి, ఉసిరి జ్యూస్ లేదా తాజా ఉసిరిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

