Health Tips: చలికాలంలో బెండకాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా మార్పులు కనిపిస్తాయి. కొన్ని ఫుడ్స్ ఆరోగ్యానికి మేలుచేస్తే.. మరికొన్ని హాని చేేసే అవకాశం ఉంది. అందుకే చాలామంది చలికాలంలో కొన్ని ఫుడ్స్ పక్కన పెట్టేస్తుంటారు. అందులో బెండకాయ ఒకటి. అసలు చలికాలంలో బెండకాయ తింటే ఏమవుతుంది?

చలికాలంలో బెండకాయ తింటే ఏమవుతుంది?
సాధారణంగా చలికాలంలో జీర్ణక్రియ మందగించడం, నీటి శాతం తగ్గిపోవడం, చర్మం పొడిబారడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే ఈ సమయంలో బెండకాయ తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. బెండకాయలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
శరీరానికి సహజ తేమ
బెండకాయలో ఉండే సహజ జెల్ (మ్యూసిలేజ్) శరీరానికి మేలు చేస్తుంది. చలికాలంలో శరీరంలో నీరు తగ్గిపోవడం, చర్మం పొడిగా మారడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తాయి. అయితే బెండకాయలోని మ్యూసిలేజ్ శరీరానికి సహజ తేమను అందించి, జీర్ణక్రియను సాఫీగా కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తి
సాధారణంగా చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, అలెర్జీలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. బెండకాయలోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్.. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి శరీరాన్ని రక్షిస్తాయి.
కడుపు సంబంధిత సమస్యలు
చలికాలంలో నీటిని తక్కువగా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. బెండకాయలోని మ్యూసిలేజ్ పేగుల్లో సహజమైన జారుడుతనాన్ని పెంచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే బెండకాయలోని ఫైబర్.. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యానికి
చలికాలంలో చర్మం పొడిగా, రఫ్‌గా కనిపిస్తుంది. బెండకాయలోని యాంటీఆక్సిడెంట్స్, జెల్ చర్మానికి లోపలి నుంచి సహజ తేమను అందించడంలో సహయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వాతావరణం వల్ల వచ్చే నష్టాల నుంచి రక్షిస్తాయి. బెండకాయను ఆహారంగా తీసుకోవడంతోపాటు బెండకాయ నీళ్లను పెదవులు, చేతులకు అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శక్తి పెరగడానికి
చలికాలంలో శరీరం వేడి కోసం ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తుంది. ఈ సమయంలో శరీరానికి తేలికపాటి, పోషక విలువలతో నిండిన ఆహారం అవసరం. బెండకాయలో ఫోలేట్, విటమిన్ A, K, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను అందించి శక్తి పెరగడానికి సహాయపడతాయి. అయితే కిడ్నీలో రాళ్లు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు బెండకాయను తక్కువగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

