పండక్కి మటన్ కొంటున్నారా.? ముదురు మాంసాన్ని ఎలా గుర్తించాలి, లేత మాంసం ఎలా ఉంటుంది?
Mutton: సంక్రాంతి పండుగకు చాలా మంది నాన్ వెజ్ తింటారు. ముఖ్యంగా మటన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చికెన్‌తో పోల్చితే మటన్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన విషయాలు
సంక్రాంతి అంటేనే కుటుంబ సభ్యులంతా కలిసే గొప్ప వేడుక, అతిథుల సందడి, ప్రత్యేక వంటకాలు. ఈ పండుగ రోజుల్లో చాలామంది మటన్ వంటకాలకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ చికెన్‌లా మటన్‌లో ఏ భాగం అడగాలి, ఏది వంటకు బాగుంటుంది అనే అవగాహన చాలామందికి ఉండదు. దుకాణదారుడు ఇచ్చింది తీసుకువచ్చి, ఉడకలేదని లేదా గట్టిగా ఉందని బాధపడతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మటన్ ఎంపికలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
లేత మటన్ గుర్తించే చిట్కాలు
మటన్ కొనేటప్పుడు ముందుగా రంగును గమనించాలి. లేత మటన్ సాధారణంగా గులాబీ రంగులో లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది. బాగా ముదురు ఎరుపు రంగులో ఉన్న మాంసం పాతదై ఉండే అవకాశం ఉంటుంది. పసుపు లేదా గోధుమ రంగు కనిపిస్తే అది నిల్వ ఉంచిన మాంసమని అర్థం చేసుకోవాలి. తాజా మటన్‌కు ఎలాంటి దుర్వాసన ఉండదు, స్పర్శకు మృదువుగా ఉంటుంది.
మేక మాంసం ఎందుకు మంచిదంటే?
గొర్రె మాంసంతో పోల్చితే మేక మాంసం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మేక మాంసంలో ఐరన్, విటమిన్ బి12, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పరిమాణం తక్కువగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. పండుగ రోజుల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలంటే మేక మటన్‌ను ఎంచుకోవడం మంచిది.
వంటకు ఏ భాగం తీసుకోవాలి?
మటన్‌లో ప్రతి భాగానికి వేర్వేరు ఉపయోగాలు ఉంటాయి. మెడ భాగం మృదువుగా ఉండటంతో కూరలు, పలావ్‌కు బాగా సరిపోతుంది. తొడ భాగంలో కొవ్వు తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి మంచిది, కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. చెస్ట్, వీపు భాగాలు గ్రేవీ వంటకాలకు బాగుంటాయి. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో అయితే మెడ లేదా చెస్ట్ భాగం తీసుకోవడం ఉత్తమం.
శుభ్రపరిచే విధానం, ఉడకబెట్టే జాగ్రత్తలు
ఎంత లేత మటన్ అయినా సరైన విధంగా శుభ్రం చేయకపోతే రుచి తగ్గుతుంది. కొనుగోలు చేసిన వెంటనే శుభ్రమైన నీటితో బాగా కడగాలి. సరైన ఉష్ణోగ్రతలో, తగినంత సమయం ఉడకబెట్టాలి. అధికంగా మటన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పండుగ ఆనందం కోసం మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.

