WaterMelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? ఏమవుతుందో తెలుసా
సమ్మర్ వచ్చిందంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. జ్యూస్ స్టాల్స్‌లో కూడా వాటర్‌మెలాన్ జ్యూస్ కచ్చితంగా ఉండాల్సిందే. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే మనలో చాలా మంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇంతకీ పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేయొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే సమ్మర్‌లో ఇది బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పొచ్చు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడడంలో పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని అమైనో ఆమ్లం సిట్రులైన్ రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే బీపీ పేషెంట్స్ కచ్చితంగా ఈ పండును తీసుకోవాలని సూచిస్తుంటారు. నీటి శాతం ఎక్కువగా ఉండడం, కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతో దోహదడుతుంది.
అయితే మనలో చాలా మంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే పుచ్చకాయలోని పోషక విలువలు తగ్గుతాయని, గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయడమే మంచిదని సూచిస్తున్నారు. బయట వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయ పాడవుతుందని అనుకుంటాం. కానీ అలా జరగదని పైగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల పుచ్చకాయ ఫుడ్ పాయిజన్‌గా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కోసిన పుచ్చకాయను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని, దీనివల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
eating watermelon
కొన్ని రోజుల పాటు పరీక్షించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో భాగంగా రెండు వాటర్‌మెలాన్లను తీసుకున్నారు. వీటిలో ఒక దానిని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే. మరొక దానిని గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేశారు. ఇలా 14 రోజుల పాటు స్టోర్ చేసిన తర్వాత. రెండింటినీ పరీక్షించగా గదిలో ఉన్నవాటిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. సహజంగా పుచ్చకాయను తెంపిన తర్వాత కూడా కొన్ని పోషకాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అయితే ఎప్పుడైతే దానిని రిఫ్రిజిరేటర్‌లో పెడతారో పోషకాల ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది లేదా ఆగిపోతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే ఏ రకంగా చూసుకున్నా పుచ్చకాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడమే మంచిది.
పుచ్చకాయతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే.?
* ఇందులోని విటమిన్ A, Cలు చర్మాన్ని తాజాగా, మెరిసేలా ఉంచుతాయి.
* పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* ఇందులోని లైకోపీన్ గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.
* పుచ్చకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖయంగా రేచీకటి లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.