Hot Water: భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగితే ఏమౌతుంది?
Hot Water: కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు భోజనం తర్వాత వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

వేడి నీళ్లు.....
మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, మంచినీళ్లు కూడా అంతే అవసరం. దాహం వేసిన ప్రతిసారీ మనం నీరు తాగుతాం. అంతేకాకుండా, చాలా మంది భోజనం చేయడానికి ముందు లేదంటే.. భోజనం చేసిన తర్వాత మంచి నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ, భోజనం చేసిన ప్రతిసారీ వేడి నీళ్లు తాగే అలవాటు మీకు ఉందా? అసలు ఇలా ఎందుకు తాగాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…..
భోజనం అతిగా తిన్నప్పుడు...
మనలో చాలా మందికి అతిగా తినే అలవాటు ఉంటుంది. ఇలా అతిగా తిన్నప్పుడు, ముఖ్యంగా చికెన్, మటన్ లాంటి మాంసాహారం కడుపునిండా తిన్న తర్వాత ఆ ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఆహారం సులభంగా జీర్ణం కాని సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో కేవలం హాట్ వాటర్ తాగితే సరిపోతుందని మీకు తెలుసా?
భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత వేడి నీళ్లు తాగాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా, కొంచెం కొంచెంగా కాస్త విరామం ఇచ్చి తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
వేడి నీళ్లు ఎందుకు మంచిది?
తిన్న తర్వాత వేడినీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరంలో జీవక్రియలు కూడా జరుగుతాయి. ఇంకా శరీరం ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం సులభం అవుతుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా, వేడినీళ్లు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ద్వారా విష పదార్థాలు బయటకు పోతాయి. శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. ఇంకా రక్త ప్రసరణ చురుగ్గా ఉండటం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం...
తిన్న తర్వాత వేడినీళ్లు తాగొచ్చు. కానీ మరీ ఎక్కువ వేడితో తాగొద్దని గుర్తుంచుకోండి. గోరువెచ్చని నీటిని తాగాలి. మామూలు వేడినీళ్లకు బదులుగా, అందులో కొన్ని పుదీనా, తులసి ఆకులు వేసుకుని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

