Non Veg Diet: నాన్ వెజ్‌తో పాటు ఇవి తింటే ప్రమాదమే.. ఎందుకంటే ?
Foods to Avoid with Non Veg: కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఇక ఆదివారం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాన్ వెజ్ తప్పనిసరి. అయితే.. నాన్ వెజ్ తో కొన్ని ఆహారాలు తినకూడదు. వాటి వల్ల అజీర్ణం లేదా ఇతర జీర్ణ సమస్యలు రావొచ్చు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటీ?

పాల ఉత్పత్తులు
చేపలు, రొయ్యలు, ఎండు చేపలు వంటి సముద్ర ఆహారాలు తినేటప్పుడు పాలు, మజ్జిగ, పెరుగు వంటివి తినకూడదు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి నాన్ వెజ్ తో పాలు, పాల పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ ఆమ్ల ఉత్పత్తి అవసరం. పాల ఉత్పత్తులు ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి, దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చేపల్లోని ప్రోటీన్లు, పాలలోని ప్రోటీన్లతో కలిసి కొంతమందికి అలెర్జీ, దురద వంటి సమస్యలు వస్తాయి.
పాలకూర
మాంసాహారంతో పాలకూర తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. నాన్ వెజ్ తో పాలకూర తింటే ఫుడ్ పాయిజనింగ్‌కి దారి తీసే అవకాశముంది. పాలకూరలోని ఆక్సాలిక్ ఆమ్లం, మాంసంలోని కాల్షియం, ఐరన్ తో చర్య జరపవచ్చు. ఆయుర్వేదం ప్రకారం పాలకూర, మాంసాహారం వేర్వేరు జీర్ణకాలాన్ని కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణం, అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే, వీటిని వేర్వేరుగా తీసుకోవడం మంచిది.
సిట్రస్ పండ్లు
నాన్ వెజ్‌తో ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తినకూడదు. ఇవి నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ఎంజైమ్‌లను నీరుగార్చి మాంసం జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు మాంసంలోని ప్రోటీన్లు జీర్ణక్రియను అడ్డుకుంటాయి. దీంతో గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చు. మాంసం, పండ్లు జీర్ణం కావడానికి పట్టే సమయం వేర్వేరుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
తేనె
మాంసాహారం తిన్న వెంటనే తేనె తినకూడదు. తేనెకు వేడి స్వభావం ఉండటం, మాంసాహారంతో కలిస్తే శరీరంలో అధిక వేడిని కలిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, మంట, గ్యాస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వేడి చేసిన తేనెను మాంసాహారంతో కలిపి తినడం విష ప్రభావాన్ని కలిగించే అవకాశముందని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. అందుకే మాంసాహార భోజనం తర్వాత తేనె తినకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రెండింటికీ మధ్య సరైన గ్యాప్ ఉండాలి.
అధిక కారంగా ఉండే ఆహారాలు
మాంసాహారంలో ఎక్కువ కారం వాడకూడదు. మాంసాహారంలో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎక్కువ కారం, నూనె కలిపితే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. రుచి కోసం తక్కువ కారం వాడటం మంచిది. కానీ ఎక్కువ కారం కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
టీ, కాఫీ
నాన్ వెజ్ తిన్న తర్వాత టీ, కాఫీ తాగకూడదు. వీటిలో ఉండే టానిన్లు, కెఫిన్లు మాంసంలోని ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇక టీ, కాఫీ ఈ సమయాన్ని మరింత పెంచుతాయి లేదా జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి మాంసాహారం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.
వైద్య సలహా
మాంసాహారం తిన్న తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం:
- మాంసాహారం తిన్న తర్వాత కనీసం 3–4 గంటల గ్యాప్ ఇచ్చిన తరువాతే ఇతర ఆహారాలు తీసుకోవాలి.
- భోజనానికి ముందు, తర్వాత తగినంత నీరు తాగాలి, కానీ, భోజన సమయంలో అధికంగా నీరు తీసుకోకూడదు.
- మాంసాహారాన్ని తక్కువ నూనెతో, తక్కువ మసాలాలతో వండటం ఆరోగ్యకరం.
- ప్రతి ఒక్కరి జీర్ణవ్యవస్థ వేర్వేరుగా పనిచేస్తుంది. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
- మాంసాహారం వల్ల అలెర్జీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి.