ఈ దీపావళికి నోరూరించే రవ్వ లడ్డును ఇలా సింపుల్ గా చేసేయండి
హిందూ సంస్కృతిలో దీపావళి పండుగకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ రోజు ఇంటిని అందంగా అలంకరించడం, దీపాలు వెలిగించడంతో పాటు టేస్టీ వంటకాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా స్వీట్లు. ఈ దీపావళికి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా చేసుకోగలిగే ఓ స్వీట్ రెసిపీ మీకోసం.

Ravva Laddu Recipe
దీపావళి పండుగకు చాలామంది స్వీట్స్ బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చాలా తక్కువ టైంలో తయారు చేసుకోగలిగే క్లాసిక్ హోంమేడ్ స్వీట్ ఒకటి ఉంది. అదే రవ్వ లడ్డు. దీన్ని ఎవ్వరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వ లడ్డును పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. సాధారణంగా పండుగ రోజు చాలా పనులు ఉంటాయి కాబట్టి.. సింపుల్ గా తయారయ్యే ఈ స్వీట్ చేసేయండి. ఈ లడ్డు మీ దీపావళి తీపి జ్ఞాపకాల్లో ఒకటిగా మారిపోవడం పక్కా. మరి ఆలస్యమెందుకు ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. తర్వాత ¾ కప్పు చక్కెర, ¼ కప్పు నెయ్యి, ¼ టీ స్పూన్ యాలకుల పొడి, 10 జీడి పప్పులు, 10–12 కిస్మిస్, పాలు అవసరమైనన్ని, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి.
తయారీ విధానం
ఒక మందపాటి పాన్ లో ఒక కప్పు రవ్వ వేసి.. లో ఫ్లేమ్ పై 5 నిమిషాల పాటు లైట్ గా వేయించి దాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, జీడి పప్పు, కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చేవరకు వేయించి.. వాటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో వేయించిన రవ్వను వేసి, దానిలో వేయించిన జీడి పప్పు, కిస్మిస్, యాలకుల పొడి, కొబ్బరి తురుము, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.
మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే
తర్వాత ఆ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ.. పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు పోయకూడదు. ఆ మిశ్రమం కాస్త వేడిగా ఉండగానే చేతులతో చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మరింత గట్టిపడతాయి. అప్పుడు తింటే సూపర్ గా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
రవ్వలో ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా తినవచ్చు. రవ్వ లడ్డులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటివి వేస్తాం కాబట్టి... అవి తిన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. దీపావళి లాంటి పండుగల కోసం ఈ స్వీట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.