ఈ దీపావళికి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ టేస్టీ స్వీట్ చేయండి.. చాలా ఈజీ ప్రాసెస్
దీపావళి పండుగ నాడు మీ కుటుంబ సభ్యులకోసం ప్రత్యేకమైన స్వీట్ తయారు చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ రెసిపీ. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా తయారు చేసుకునే టేస్టీ స్వీట్ ఒకటి ఉంది. అదేంటో.. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.

స్వీట్ రెసిపీ
స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇక పండుగల టైంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఏదో ఒక స్వీట్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా తయారుచేయగలిగే టేస్టీ స్వీట్ ఒకటి ఉంది. ఈ దీపావళికి ఆ స్వీట్ తయారుచేసి మీ కుటుంబ సభ్యులకు తినిపించండి. చాలా సంతోషిస్తారు. మరి ఆ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు
ముందుగా అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒకటి లేదా రెండు యాలకులు, ఒక కప్పు పాలు, 2 స్పూన్ల ఎండుకొబ్బరి తురుము, కొంచెం నెయ్యి, ఒక కప్పు చక్కెర, వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి.
తయారీ విధానం
ఫస్ట్ రవ్వను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి. దాంట్లో ఒకటి లేదా రెండు యాలకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పాలు వేసి ఒక పొంగు వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. పొంగు వచ్చాక లో ఫ్లేమ్ లో పెట్టి రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న రవ్వను అందులో వేసి మెత్తగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి.. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని.. వేడి తగ్గేవరకు పక్కన పెట్టుకోవాలి.
చక్కెర పాకం..
తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు నీళ్లు, అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి. పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్ లో వేడి చేయాలి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, రెండు యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. చిక్కబడే వరకు ఉంచి.. ఆ తర్వాత స్టవ్ ఆపి చేసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
చిన్న చిన్న బాల్స్
తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి ఒక్కసారి మళ్లీ కలుపుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకొని, మీడియం ఫ్లేమ్ లో వేడిచేయాలి. అందులో మనం చేసిపెట్టుకున్న ఉండలను కొంచెం కొంచెంగా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
పాకం వేడిగా ఉన్నప్పుడే
అప్పటికే చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో.. వేయించిన ఉండలను వేసి ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే ఉండలను వేస్తే అవి చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి. ఒకవేళ గంటపాటు పక్కనపెట్టే వీలు లేకుంటే పాకం బౌల్ ను, లో ఫ్లేమ్ పై రెండు, మూడు నిమిషాలు వేడిచేస్తే చాలు.. పిండి ఉండలు చక్కెర పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి.
స్వీట్ రెడీ
ఆ తర్వాత పాకం రాకుండా ఒక స్పూన్ తో వాటిని బయటకు తీసి.. వేరే ప్లేట్ లో వేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న టేస్టీ స్వీట్ రెడి అయిపోయినట్లే. జ్యూసీ జ్యూసీగా వాటిని తింటుంటే.. ఎంత టేస్టీగా ఉంటాయో చెప్పలేము. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ దీపావళికి మీరు ఈ స్వీట్ చేసేయండి.