- Home
- Feature
- Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Color Changing Lake: ఎడారి అంటే సాధారణంగా ఇసుక తిన్నెలు, తాగునీరు లేని ఎండమావులు కనిపిస్తాయి. కానీ, చైనాలోని బదైన్ జారన్ ఎడారిలో ఒక సరస్సు ఉంది. అయితే, ఇది కాలాలను బట్టి తన రంగును మార్చుకుంటూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది.

చైనా ఎడారిలో విచిత్రం.. రంగులు మారుస్తున్న సరస్సు
ఎడారి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలు, తీవ్రమైన ఎండలు. కానీ చైనాలోని ఒక ఎడారిలో మాత్రం కళ్లు చెదిరే అద్భుతం ఒకటి ఉంది. అక్కడ ఉన్న ఒక సరస్సు నీరు ఏడాదంతా ఒకేలా ఉండదు. కాలంతో పాటు తన రంగును మారుస్తూ పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఉన్న అలషా లీగ్ పరిధిలోని బదైన్ జారన్ ఎడారిలో ఈ విచిత్రం ఉంది. ఈ ఎడారిలోని ఐదు ప్రధాన ప్రకృతి ప్రదేశాలలో దాగేతు సరస్సు ఒకటి. ఈ సరస్సు నీరు ఏడాదంతా ఒకే రంగులో ఉండదు. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఇది లేత గులాబీ రంగు నుండి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది ఏదో మాయో, మంత్రమో కాదు. దీని వెనుక అసలైన సైన్స్ దాగి ఉంది.
నీటి రంగు మారడానికి కారణాలు ఏంటి?
దాగేతు సరస్సు నీరు సాధారణ మంచినీటి సరస్సుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సరస్సు నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువ. అలాగే దీని రసాయనల కలయిక కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి అత్యధిక ఉప్పు ఉండే వాతావరణంలో కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులు మాత్రమే జీవించగలవు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ సూక్ష్మజీవుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇవి విడుదల చేసే వర్ణద్రవ్యం వల్ల సరస్సు నీరు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.
వేసవిలోనే ఈ రంగులు ఎక్కువ
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సరస్సులోని నీరు వేడెక్కుతుంది. నీటిలోని ఉప్పు, మినరల్స్ తో పాటు పెరిగిన ఉష్ణోగ్రత కొన్ని సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. దాంతో ఎరుపు లేదా గులాబీ రంగు పిగ్మెంట్లను తయారు చేసే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. అందుకే వేసవిలో ఈ సరస్సు మరింత ప్రకాశవంతమైన గులాబీ, ఎరుపు రంగుల్లో మెరిసిపోతుంది. బయటి నుండి ఎవరూ ఇందులో రంగులు కలపరు, లోపల ఉన్న జీవులే ఈ అద్భుతాన్ని చేస్తాయి.
నీరు తగ్గడం.. హెమటైట్ ప్రభావం
వాతావరణం మారే కొద్దీ సరస్సులో నీటి పరిమాణం తగ్గుతుంది. నీరు తగ్గడంతో అందులోని ఉప్పు, ఇతర ఖనిజాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సరస్సులో సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ తో పాటు హెమటైట్ అనే ఖనిజం కూడా ఉందని పరిశోధనల్లో తేలింది. హెమటైట్ సహజంగా ఎరుపు లేదా ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. సరస్సు అడుగున ఉండే ఈ మినరల్ కూడా నీటి రంగుపై ప్రభావం చూపుతుంది.
2024లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా
దాగేతు సరస్సు ఉన్న 'బదైన్ జారన్' ఎడారి వాయవ్య చైనాలోని అలాషాన్ పీఠభూమిలో ఉంది. ఇది చైనాలోనే మూడవ అతిపెద్ద ఎడారి. యునెస్కో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఎడారిలోని పెద్ద పెద్ద ఇసుక తిన్నెల మధ్య దాదాపు 144 సరస్సులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సరస్సుల నీరు ఉప్పు నీరే. ఇక్కడి ఇసుక తిన్నెలు ఏకంగా 460 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.
ఈ ఎడారిలోని ఎత్తైన ఇసుక దిబ్బలు, అరుదైన సరస్సుల వ్యవస్థ కారణంగా బదైన్ జారన్ ఎడారి - టవర్స్ ఆఫ్ శాండ్ అండ్ లేక్స్ ను 2024లో యునెస్కో (UNESCO) వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చారు. కేవలం ఉప్పు, మినరల్స్, వేడి, సూక్ష్మజీవుల కలయిక వల్ల ఏర్పడే ఈ ప్రకృతి అద్భుతాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.

