జీవితాంతం ఒక్కచుక్క కూడా నీరు తాగని ప్రాణి ఏదో తెలుసా? ఇది ఎలా బ్రతుకుతుంది?
మనకు దాహం వేయగానే నీళ్లు దొరకకుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. ఎండాాకాలంలో అయితే లీటర్ల కొద్ది నీళ్లు తాగుతుంటాం. అయితే ఎడారిలో ఎండల్లో కనిపించే ఓ జీవి బ్రతికున్నంతకాలం ఒక్కచుక్క మంచినీరు తాగదట. ఇంతకీ ఆ జీవి ఏదో తెలుసా?

భూమిపై నీళ్ళు తాగకుండా జీవించే ప్రాణి ఏదో తెలుసా?
నీరు లేకుండా మనిషి కొన్ని రోజులు కూడా జీవించడం కష్టం. ఎండలు మండిపోయే ఎడారిలో అయితే నీరు లేకుండా జీవించడం దాదాపు అసాధ్యమే అనిపిస్తుంది. కానీ ప్రకృతిలో కొన్ని జీవులు మన ఊహకు అందని విధంగా తమ శరీరాలను మార్చుకుని కఠినమైన పరిస్థితుల్లోనూ బతుకుతున్నాయి. అలాంటి అద్భుతమైన జీవుల్లో కంగారు ఎలుక ఒకటి. పేరులో ఎలుక ఉన్నప్పటికీ ఇది మన ఇళ్లలో కనిపించే సాధారణ ఎలుకలాంటిది కాదు. వెనుక కాళ్లపై కంగారూలా గెంతుతూ తిరిగే ఈ చిన్న జీవి.. నీటి కొరత తీవ్రంగా ఉండే ఎడారుల్లో జీవిస్తుంది.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… కొన్ని కంగారు ఎలుక జాతులకు తాగునీరు అవసరమే ఉండదు. ఎడారిలో ఎక్కడ నీరు దొరుకుతుందా అని వెతుక్కోవడం బదులు.. తినే విత్తనాల నుంచే అవసరమైన నీటిని పొందుతూ జీవిస్తాయి. అంతేకాదు, శరీరంలోకి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా బయటకు పోకుండా అనేక ప్రత్యేకమైన శారీరక లక్షణాలు వీటికి ఉన్నాయి.
కంగారు ఎలుకలు ఎక్కడ కనిపిస్తాయి?
కంగారు ఎలుకలు ప్రధానంగా ఉత్తర అమెరికాలోని పొడి, ఎడారి, అర్ధ ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. అమెరికా పశ్చిమ ప్రాంతాలు, మెక్సికోలోని కొన్ని ప్రాంతాలు వీటి నివాస ప్రాంతాలు. కొన్ని జాతులు కెనడాలోని పొడి గడ్డి భూముల వరకు కూడా విస్తరించాయి. సాధారణంగా ఇసుక ఎక్కువగా ఉండే ఎడారి ప్రాంతాలు, ఇసుక దిబ్బల పరిసరాలు, తక్కువ వృక్షసంపద ఉన్న పొడి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఇసుకలో వేగంగా పరుగెత్తడం సాధ్యంకాదు కాబట్టి కంగారులా మాదిరిగా గెంతుతుంటాయి... ఇందుకు అనుకూలంగా ఈ వీటి వెనక కాల్లు, తోక బలంగా ఉంటాయి.
ముఖ్యంగా మెరియం కంగారు ఎలుక (Merriam's kangaroo rat), ఆర్డ్స్ కంగారు ఎలుక (Ord's kangaroo rat) వంటి జాతులు ఎడారి వాతావరణానికి బాగా అలవాటుపడ్డాయి. ఇవి పగటి సమయంలో భూమి లోపల తవ్వుకున్న బొరియల్లో ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత బయటకు వచ్చి ఆహారం కోసం తిరుగుతాయి. ఇలా పగటి వేడి నుంచి తప్పించుకోవడం ద్వారా శరీరం నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదాన్ని తగ్గించుకుంటాయి.
పొడి విత్తనాల నుండి నీరు తీసుకుంటుందా?
ఇక్కడే కంగారు ఎలుకల అసలు ప్రత్యేకత ఉంది. వీటి ప్రధాన ఆహారం పొడి విత్తనాలు. బయటకు చూస్తే వాటిలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శరీరం ఆహారంలోని పోషకాలను విచ్ఛిన్నం చేసే సమయంలో మెటబాలిక్ వాటర్ (Metabolic Water) అనే నీరు ఉత్పత్తి అవుతుంది.
ముఖ్యంగా విత్తనాల్లోని కార్బోహైడ్రేట్లను శరీరం ఆక్సీకరణం చేసినప్పుడు నీరు ఏర్పడుతుంది. అందువల్ల బయట నుంచి నీరు తాగకపోయినా, ఆహారం జీర్ణం కావడం ద్వారా శరీరానికి అవసరమైన నీటిలో గణనీయమైన భాగం లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు కంగారు ఎలుకలు పొడి విత్తనాల ఆధారంగానే నీటి అవసరాలను తీర్చుకోగలవని చూపించాయి.
శరీరంలోని నీటిని వృథా చేయకుండా జాగ్రత్త
కేవలం ఆహారం ద్వారా నీటిని పొందడం మాత్రమే కంగారు ఎలుకల ప్రత్యేకత కాదు. శరీరంలోకి వచ్చిన నీటిని వీలైనంత ఎక్కువగా నిలుపుకోవడం కూడా వీటి జీవన విధానంలో కీలకమైన భాగం. వీటి మూత్రపిండాలు నీటిని చాలా సమర్థంగా సంరక్షిస్తాయి. చాలా తక్కువ నీటితోనే వ్యర్థాలను బయటకు పంపేలా అత్యంత సాంద్రమైన మూత్రాన్ని ఉత్పత్తి చేయగలవు. అలాగే మలంలోనూ నీటి నష్టం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా శరీరంలోకి వచ్చిన ప్రతి చుక్కను సాధ్యమైనంత సమర్థంగా ఉపయోగించుకుంటాయి.
ముక్కుతో కూడా నీటిని కాపాడుకుంటాయి
కంగారు ఎలుకల్లో మరో అద్భుతం వాటి ముక్కులోని ప్రత్యేక నిర్మాణం. శ్వాస సమయంలో శరీరం నుంచి తేమ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే వీటి ముక్కులోని సన్నని, వంకరగా ఉండే మార్గాలు బయటకు వెళ్లే గాలిని చల్లబరచడంలో సహాయపడతాయి. దీంతో శ్వాస ద్వారా కోల్పోయే నీటి పరిమాణం తగ్గుతుంది. అంటే ఒకవైపు ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా నీటిని తయారు చేసుకుంటూ.. మరోవైపు మూత్రం, మలం, శ్వాస ద్వారా నీరు బయటకు పోకుండా శరీరం జాగ్రత్త పడుతుంది. ఈ రెండు లక్షణాల కలయికే ఎడారిలో వాటి మనుగడకు ఎంతో కీలకం.
కంగారు ఎలుకలు రాత్రిపూటే బయటకు రావడానికి కారణం ఇదే..
ఎడారిలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో బయట తిరిగితే శరీరం వేడెక్కడంతో పాటు నీటి నష్టం కూడా పెరుగుతుంది. అందుకే కంగారు ఎలుకలు ఎక్కువగా రాత్రిపూట చురుగ్గా ఉంటాయి. పగటిపూట చల్లగా ఉండే భూగర్భ బొరియల్లో దాక్కుంటాయి. రాత్రి బయటకు వచ్చి విత్తనాలను సేకరిస్తాయి.
ఇవి సేకరించిన విత్తనాలను తమ బొరియల్లో నిల్వ చేసుకోవడం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బొరియలోని తేమ కారణంగా నిల్వ చేసిన విత్తనాలు కొంత తేమను గ్రహిస్తాయి. అంటే కంగారు ఎలుకలకు బొరియ అనేది కేవలం నివాస స్థలం మాత్రమే కాదు.. ఆహార నిల్వ కేంద్రంగానూ పనిచేస్తుంది.
కంగారూ ఎలుకలు గెంతుతూ ఎందుకు తిరుగుతాయి?
కంగారు ఎలుకలకు ఈ పేరు రావడానికి కారణం వాటి వెనుక కాళ్లు. ముందు కాళ్లతో పోలిస్తే వెనుక కాళ్లు పొడవుగా, బలంగా ఉంటాయి. ఇవి రెండు వెనుక కాళ్లపై వేగంగా గెంతుతూ కదులుతాయి. పొడవైన తోక శరీరానికి సమతుల్యతను అందిస్తుంది.
ఈ గెంతే నడక ఎడారి ఇసుక ప్రాంతాల్లో వేగంగా కదలడానికి ఉపయోగపడటమే కాకుండా.. వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడంలో కూడా సహాయపడుతుంది. గుడ్లగూబలు, పాములు, నక్కలు వంటి వేటాడే జంతువులు వీటికి ప్రమాదకరమైన శత్రువులు.
నీరు తాగకపోవడం వెనుక ప్రకృతి అద్భుతం
కంగారు ఎలుక కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఎడారిలో నీరు దొరకడం కష్టం కాబట్టి ఈ జీవి నీటి కోసం తన స్థావరాన్ని మార్చుకోలేదు.. తన శరీరాన్నే ఆ వాతావరణానికి అనుగుణంగా మార్చుకుంది. పొడి విత్తనాల నుంచి నీటిని పొందడం, నీటి నష్టాన్ని తగ్గించడం, రాత్రిపూట మాత్రమే చురుగ్గా ఉండడం, భూగర్భ బొరియల్లో ఆశ్రయం పొందడం వంటి అనేక అనుసరణలు కలిసి దీనిని ఎడారి జీవనానికి అద్భుతంగా సరిపోయేలా చేశాయి.

