- Home
- Feature
- బిర్యానీ అంటే అర్థం ఏంటి.? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది.? చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
బిర్యానీ అంటే అర్థం ఏంటి.? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది.? చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
Biryani History: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో బిర్యానీ ఒకటి. చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ఎక్కడ చూసినా బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే బిర్యానీ కేవలం ఒక వంటకం మాత్రమే కాదు. దీని వెనుక శతాబ్దాల చరిత్ర ఉందని తెలుసా?

బిర్యానీ అనే పేరు ఎలా వచ్చింది?
బిర్యానీ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని చెతుతారు. పర్షియన్ భాషలోని 'బిరియన్' అనే పదానికి వండటానికి ముందు వేయించడం అనే అర్థం ఉంది. అలాగే 'బిరింజ్' అనే మరో పర్షియన్ పదానికి బియ్యం అని అర్థం. ఈ రెండు పదాలకు బిర్యానీ పేరుతో సంబంధం ఉందని చెబుతారు. బిర్యానీ తొలి రూపాల్లో బియ్యాన్ని నెయ్యిలో వేయించి, మాంసంతో కలిపి నెమ్మదిగా ఉడికించేవారని భావిస్తారు. ఇలా బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాలను కలిపి వండే పద్ధతి క్రమంగా అభివృద్ధి చెందింది. అయితే బిర్యానీ అనే పేరు ఎలా ఏర్పడింది, ఈ వంటకం మొదట ఎక్కడ తయారైంది అనే విషయాలపై పూర్తి స్పష్టత లేదు. దీనికి సంబంధించి చారిత్రక ఆధారాలతో పాటు అనేక కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
పర్షియా నుంచి మొఘలుల కాలం వరకు..
బిర్యానీ చరిత్ర గురించి చెప్పేటప్పుడు పర్షియన్ వంటకాల సంప్రదాయాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన 'పులావ్' వంటకం బిర్యానీ అభివృద్ధిపై ప్రభావం చూపిందని చరిత్రకారులు భావిస్తారు. మొఘల్ పాలకులు భారత్‌కు వచ్చిన తర్వాత పర్షియన్ వంటకాల సంప్రదాయాలు భారతీయ వంటకాలతో కలిశాయి. అప్పట్లో రాజుల ఆస్థానాల్లో పనిచేసే వంటవాళ్లు స్థానికంగా లభించే బియ్యం, మసాలాలు, మూలికలను ఉపయోగించి కొత్త వంటకాలను తయారు చేసేవారు. భారతీయ వంటకాల ప్రత్యేకతలకు అనుగుణంగా పర్షియన్ వంట పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. పెరుగు, కుంకుమపువ్వు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలను ఉపయోగించి బిర్యానీని మరింత రుచికరంగా తయారు చేయడం ప్రారంభించారు.
మొఘల్ పాలనలో రాజభవనాల వంటశాలల్లో ఇలాంటి వంటకాలకు ప్రాధాన్యం పెరిగింది. కాలక్రమేణా బిర్యానీ రాజుల భోజనాలకే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాలకు విస్తరించింది. అయితే బిర్యానీని భారత్‌కు మొఘలులే మొదట తీసుకొచ్చారని కచ్చితంగా నిర్ధారించే ఆధారాలు లేవు. భారతదేశంలో బిర్యానీ రూపుదిద్దుకోవడంలో పలు ప్రాంతాల వంటకాల సంప్రదాయాలు కూడా పాత్ర పోషించాయి.
ముంతాజ్ మహల్‌కు బిర్యానీతో సంబంధం ఏమిటి?
బిర్యానీ చరిత్రలో ముంతాజ్ మహల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ ఒకసారి సైనికుల శిబిరాన్ని సందర్శించారట. అక్కడ సైనికులు సరైన ఆహారం తీసుకోక బలహీనంగా ఉండటాన్ని ఆమె గమనించారని ఈ కథ చెబుతుంది. దీంతో సైనికులకు శక్తినిచ్చేలా బియ్యం, మాంసం కలిపి పోషక విలువలు కలిగిన వంటకాన్ని తయారు చేయాలని ఆమె రాజవంటవాళ్లకు సూచించారట. అలా బిర్యానీ పుట్టిందని కొందరు చెబుతారు.
బిర్యానీ చరిత్రకు ఆధారంగా నిలిచిన 'ఐన్-ఇ-అక్బరీ'
బిర్యానీ చరిత్రను అర్థం చేసుకోవడానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనా కాలానికి చెందిన 'ఐన్-ఇ-అక్బరీ' అనే గ్రంథం ముఖ్యమైనది. 16వ శతాబ్దంలో అబుల్ ఫజల్ రచించిన ఈ గ్రంథంలో అక్బర్ పాలన, పరిపాలనా విధానాలు, రాజభవన సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల గురించి వివరాలు ఉన్నాయి. అప్పటి రాజవంటశాలల్లో తయారుచేసే వివిధ రకాల బియ్యం వంటకాల గురించి కూడా ఇందులో ప్రస్తావనలు ఉన్నాయి. వీటిలో కొన్ని వంటకాలను నేటి బిర్యానీకి పూర్వ రూపాలుగా భావిస్తారు. అయితే ఈ గ్రంథంలో ప్రస్తావించిన ప్రతి బియ్యం వంటకాన్ని నేటి బిర్యానీతో సమానంగా చూడలేం. అప్పట్లో పులావ్‌తో పాటు ఇతర రకాల బియ్యం వంటకాలు కూడా ఉండేవి. వాటి తయారీ విధానాలు, పదార్థాలు కాలక్రమేణా మారుతూ వచ్చాయి. ఈ విధంగా చారిత్రక గ్రంథాలు మొఘల్ కాలంలో బియ్యం ఆధారిత వంటకాలకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. బిర్యానీ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
భారతదేశంలో బిర్యానీకి ఇంత ప్రత్యేకత ఎందుకు?
భారతదేశానికి బిర్యానీ పరిచయమైన తర్వాత అది ఒకే రకమైన వంటకంగా మిగిలిపోలేదు. ఒక్కో ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు, అందుబాటులో ఉన్న పదార్థాలు, వంట పద్ధతులకు అనుగుణంగా కొత్త రూపాలను సంతరించుకుంది. హైదరాబాద్ బిర్యానీలో మసాలాల ఘాటు, ప్రత్యేకమైన సువాసన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. లక్నో బిర్యానీని సాధారణంగా నెమ్మదిగా ఉడికించే పద్ధతిలో తయారు చేస్తారు. కోల్‌కతా బిర్యానీలో బంగాళాదుంపలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతం తనదైన ప్రత్యేకతను బిర్యానీకి జోడించింది.
బిర్యానీ ప్రాచుర్యం పొందడానికి దాని రుచి మాత్రమే కారణం కాదు. బియ్యం, మాంసం, మసాలాలను ఒకే వంటకంలో కలిపి తయారు చేయడం, ప్రత్యేకమైన సువాసన, వండే విధానంలో ఉన్న వైవిధ్యం కూడా దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం బిర్యానీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ ప్రసిద్ధి చెందింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ వంటి అనేక రకాలుగా అందుబాటులో ఉంది.





